మహిళా పారిశ్రామికవేత్తలకు కొత్త దిశ
మహిళా పారిశ్రామికవేత్తలకు కొత్త దిశ
ఎంపవర్ింగ్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్
70 మందికిపైగా మహిళా వ్యాపారవేత్తల భాగస్వామ్యం
వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్’ లక్ష్య సాధనకు పిలుపు
ఉద్యమ్, జీఎస్టీ, స్టార్టప్, ట్రేడ్‌మార్క్ నమోదులకు విశేష స్పందన
విజయవాడ, ఆంధ్రప్రభ : మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ వ్యాపార రంగంలో మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఆర్‌టీఐహెచ్ విజయవాడలో ‘ఎంపవర్ింగ్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్’ అవగాహన, ఇంటరాక్షన్ కార్యక్రమంతో పాటు ‘రైజ్‌అప్ ఎంఎస్‌ఎంఈ’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎనికేపాడులోని ఆర్‌టీఐహెచ్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి 70 మందికిపైగా మహిళా ఎంఎస్‌ఎంఈ పారిశ్రామికవేత్తలు హాజరై వివిధ సేవలు, అవకాశాలపై అవగాహన పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీష మాట్లాడుతూ ఆర్‌టీఐహెచ్ ద్వారా అందుబాటులో ఉన్న డిజిటల్ సేవలు, వ్యాపారాభివృద్ధి అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

జిల్లాలో ఆర్‌టీఐహెచ్ వంటి సదుపాయం ఉండటం అదృష్టకరమని పేర్కొంటూ, దీనిని వ్యాపారాభివృద్ధికి వేదికగా మలుచుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన ‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్’ లక్ష్య సాధనలో మహిళలు కీలక పాత్ర పోషించాలని, స్వయం ఉపాధి, సూక్ష్మ పరిశ్రమల ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. ఆర్‌టీఐహెచ్ సీఈఓ జి. కృష్ణన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఈ-కామర్స్, జీఎస్టీ, ట్రేడ్‌మార్క్, బ్రాండింగ్, వ్యాపార విస్తరణ అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన మార్గదర్శకాలను అందించారు.
కార్యక్రమంలో భాగంగా ఆరు ఉద్యమ్ నమోదులు, 16 వాల్‌మార్ట్ ఎల్‌ఎంఎస్ నమోదులు, రెండు జీఎస్టీ నమోదులు, ఒక స్టార్టప్ నమోదు, ఒక ట్రేడ్‌మార్క్ నమోదు, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నమోదు నిర్వహించడం విశేషంగా నిలిచింది. దీంతో మహిళా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ద్వారా లభించే అవకాశాలను వినియోగించుకునేందుకు ముందుకు వచ్చినట్లు స్పష్టమైంది.
మధ్యాహ్నం అనంతరం నిర్వహించిన వన్-టు-వన్ ఇంటరాక్షన్ సెషన్‌లో జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులు, వాల్‌మార్ట్ ప్రతినిధులు, వాల్‌మార్ట్ వృద్ధి కార్యక్రమ అమలు భాగస్వామ్య సంస్థ ప్రతినిధులు, ఐపీఆర్ నిపుణులు, ఆర్‌టీఐహెచ్ ప్రోగ్రామ్ అసోసియేట్లు పాల్గొని మహిళా పారిశ్రామికవేత్తల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. వ్యాపార నిర్వహణ, బ్రాండింగ్, మార్కెటింగ్, మేధో సంపత్తి హక్కులు, డిజిటల్ విక్రయాలపై జరిగిన చర్చలు పాల్గొన్న మహిళలకు ఉపయోగకరంగా మారాయి. కార్యక్రమం ముగింపులో ఆర్‌టీఐహెచ్ విజయవాడ అందిస్తున్న సేవలను పాల్గొన్న మహిళా పారిశ్రామికవేత్తలు అభినందిస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
