నీట్-పీజీ 2026 పరీక్షలకు కేంద్రం పకడ్బందీ ఏర్పాట్లు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆగస్టు 30న నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్-పీజీ)–2026 పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జాతీయ వైద్య పరీక్షల బోర్డు (NBEMS), సాంకేతిక భాగస్వాములు, పరీక్ష నిర్వహణలో భాగస్వాములైన ఇతర సంస్థల సంసిద్ధతపై మంత్రి ఆరా తీశారు. పరీక్ష నిర్వహణ, అభ్యర్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, నీట్-పీజీ–2026 కోసం ప్రవేశపెట్టిన సాంకేతిక ఆధారిత సంస్కరణలపై అధికారులు వివరించారు.

పరీక్షల సమగ్రత, భద్రతను కాపాడుతూ నిష్పాక్షికమైన, పారదర్శకమైన, విద్యార్థి కేంద్రిత వాతావరణంలో పరీక్ష నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఈ ఏడాది నీట్-పీజీ పరీక్షకు 2,73,183 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారని, ఇది గత ఏడాదితో పోలిస్తే 12.5 శాతం అధికం అని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 340 నగరాల్లోని 1,300కుపైగా పరీక్షా కేంద్రాల్లో పరీక్షను ఒకే షిఫ్ట్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

వదంతులను నమ్మొద్దు

నీట్-పీజీ-2026కు సంబంధించి ప్రశ్నపత్రం లీక్‌ వంటి వదంతులు, మోసపూరిత ప్రచారాలను నమ్మవద్దని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు. పరీక్ష ప్రారంభానికి కొద్దిసమయం ముందే అత్యంత సురక్షితమైన, రహస్య కోడ్‌తో కూడిన విధానంలో తుది ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేస్తారని తెలిపారు.

ప్రశ్నపత్రం గోప్యతను కాపాడేందుకు బహుళ స్థాయి సాంకేతిక, కార్యాచరణ భద్రతా వ్యవస్థలు అమల్లో ఉన్నాయని, పరీక్షకు ముందే ప్రశ్నపత్రం తమ వద్ద ఉందని ఎవరైనా ప్రచారం చేస్తే అది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. అభ్యర్థులు NBEMS మరియు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు.

విద్యార్థి కేంద్రిత సంస్కరణలు

  • అభ్యర్థులు మూడు రాష్ట్రాల పరీక్షా కేంద్రాల ప్రాధాన్యతలను నమోదు చేసుకునే అవకాశం.
  • పరీక్షా నగర వివరాలను పరీక్షకు మూడు వారాల ముందే ప్రకటించడం.
  • ప్రశ్నల సంఖ్యను 200 నుంచి 180కు తగ్గించి, పరీక్ష సమయాన్ని 210 నిమిషాలుగా నిర్ణయించడం.
  • అప్లికేషన్ ప్రక్రియ, పరీక్ష రోజు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధ్రువీకరణ అమలు.
  • వేలిముద్రల ధ్రువీకరణ విఫలమైతే ఐరిస్ బయోమెట్రిక్ వినియోగం.

కట్టుదిట్టమైన భద్రతా చర్యలు

పరీక్షా కేంద్రాల ముందస్తు ధ్రువీకరణ, సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ ధ్రువీకరణ, శరీర తనిఖీలు, సిగ్నల్ జామర్లు, డైనమిక్ కంప్యూటర్ కేటాయింపు, కేంద్ర, ప్రాంతీయ కమాండ్ సెంటర్ల ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షణ, స్వతంత్ర పరిశీలకుల నియామకం వంటి బహుళ అంచెల భద్రతా చర్యలు అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా 60 వేల మందికి పైగా పరీక్ష నిర్వహణ సిబ్బందిని నియమించనున్నట్లు వెల్లడించారు.

ప్రశ్నపత్రం తయారీ నుంచి పరీక్షా కేంద్రాలకు చేరే వరకు మొత్తం ప్రక్రియను బహుళ స్థాయి ఎన్‌క్రిప్షన్, సురక్షిత ఆఫ్‌లైన్ విధానం, నియంత్రిత డిజిటల్ డీక్రిప్షన్ ద్వారా నిర్వహించేలా పటిష్ట భద్రతా వ్యవస్థను అమలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. అక్రమాలను అరికట్టేందుకు NBEMS ప్రత్యేక ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తోందని, పరీక్షల్లో పారదర్శకత, నిష్పాక్షికత, సాంకేతిక భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా స్పష్టం చేశారు.