అఖిల వైద్య విద్యకు హరీశ్‌రావు అండ

ఎంబీబీఎస్ సీటు ఎక్కడ వచ్చినా ఫీజు మొత్తం భరిస్తానన్న మాజీ మంత్రి
తండ్రిని కోల్పోయిన విద్యార్థినికి విద్యాభరోసా..
డాక్టర్ కావాలన్న కలకు చేయూత

సిద్దిపేట, ఆంధ్రప్రభ : తండ్రిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో ఉన్న సిద్దిపేటకు చెందిన ప్రతిభావంతురాలు అఖిల వైద్య విద్యకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు అండగా నిలిచారు. ఎంబీబీఎస్ సీటు ఎక్కడ వచ్చినా పూర్తి ఫీజును తానే భరిస్తానని హామీ ఇచ్చి విద్యార్థినికి భరోసా కల్పించారు.

సిద్దిపేట పట్టణానికి చెందిన మద్దూరి రాజు బ్రెయిన్ క్యాన్సర్‌తో మరణించడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. భార్యతో పాటు ముగ్గురు కుమార్తెల బాధ్యతలు కుటుంబంపై భారంగా మారాయి. ఈ పరిస్థితిలో హరీశ్‌రావును ఆశ్రయించగా, కుటుంబానికి డబుల్ బెడ్‌రూం ఇల్లు ఇప్పించడంతో పాటు పిల్లల చదువుకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

అఖిల 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మెరిడియన్ విద్యాసంస్థల్లో చదివేలా ఫీజుల బాధ్యతను హరీశ్‌రావు తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చదువులో ప్రతిభ కనబరిచిన అఖిల ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షలో 720 మార్కులకు 453 మార్కులు సాధించింది. ఈ మార్కులతో ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశాలు ఉండటంతో, ఫీజుల భారం గురించి ఆందోళన చెందుతున్న అఖిలను హరీశ్‌రావు తన నివాసానికి ఆహ్వానించి ఆత్మీయంగా మాట్లాడారు.

“ముందు మంచి ఎంబీబీఎస్ సీటు సాధించు.. ఫీజుల గురించి ఆలోచించవద్దు. ఎక్కడ సీటు వచ్చినా చదివించే బాధ్యత నాది. నువ్వు డాక్టర్ కావాలి” అని హరీశ్‌రావు భరోసా ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హరీశ్‌రావు ఇచ్చిన ప్రోత్సాహంతో అఖిల వైద్య విద్యను కొనసాగించేందుకు మరింత ఆత్మవిశ్వాసం పెరిగిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.