అరుణాచలంలో కొత్త నిబంధనలు అమలు
తిరువణ్ణామలై, ఆంధ్రప్రభ: అరుణాచలంలోని గిరివలయం మార్గంలో ఉన్న మోక్షమార్గం (ఇడుక్కు పిళ్లయ్యార్ గుహ) వద్ద ఇటీవల జరిగిన విషాద ఘటన నేపథ్యంలో ఆలయ యంత్రాంగం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ భక్తుడు ఇరుకైన రాతి మార్గంలో చిక్కుకుని ఊపిరాడక మృతిచెందిన ఘటనతో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.
కొత్త నిబంధనల ప్రకారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మోక్షమార్గంలో భక్తులకు ప్రవేశం కల్పించనున్నారు. రద్దీని నియంత్రించేందుకు ఒకేసారి పరిమిత సంఖ్యలోనే భక్తులను లోపలికి అనుమతించనున్నారు.
అలాగే పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, శారీరక ఇబ్బందులు ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు ఈ ఇరుకైన మార్గంలో వెళ్లవద్దని అధికారులు సూచించారు. గుహలో ఎక్కువసేపు ఉండటం, ఫొటోలు, వీడియోలు తీయడం, తోపులాటలకు పాల్పడడం పూర్తిగా నిషేధించారు.
భక్తులు ఆలయ సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలని, ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ మార్గాన్ని ఉపయోగించకుండా ఉండాలని ఆలయ యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త సమయాలు, నిబంధనలను అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
