ఆపరేషన్ ముస్కాన్ సక్సెస్..
648 మంది చిన్నారులకు విముక్తి
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో నెల రోజుల ప్రత్యేక డ్రైవ్..
బాల కార్మికులను పనిలో పెట్టుకున్న 205 మందిపై కేసులు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: బాల కార్మిక వ్యవస్థ, భిక్షాటన, ఇతర అసురక్షిత పరిస్థితుల్లో చిక్కుకున్న చిన్నారులను రక్షించేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్–XII విజయవంతమైంది. జూలై 1 నుంచి 31 వరకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో మొత్తం 648 మంది చిన్నారులను గుర్తించి సురక్షితంగా రక్షించినట్లు పోలీస్ కమిషనర్ బడుగుల సుమతి, ఐపీఎస్ వెల్లడించారు.
రక్షించబడిన వారిలో తెలంగాణకు చెందిన 262 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన 386 మంది చిన్నారులు ఉన్నారు. కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ఎనిమిది ప్రత్యేక ముస్కాన్ బృందాలు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్‌టీయూ)తో కలిసి పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, హోటళ్లు, వర్క్‌షాపులు, నిర్మాణ ప్రదేశాలు, వాణిజ్య సంస్థలు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి చిన్నారులను గుర్తించి రక్షించాయి.
ఈ ఆపరేషన్‌లో భాగంగా 36 హాట్‌స్పాట్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అలాగే 54 చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్లలో డార్పన్ వ్యవస్థ ద్వారా తనిఖీలు నిర్వహించి 5,828 డార్పన్ సెర్చ్‌లు పూర్తి చేశారు. చిన్నారుల భద్రత, సంక్షేమం, సీసీటీవీ పర్యవేక్షణ, వైద్య సదుపాయాలపై భద్రతా ఆడిట్లు కూడా చేపట్టారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై 97 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి 2,210 మంది వ్యాపారులు, యజమానులు, కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పించారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న వారిపై 205 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంతో పాటు 390 జనరల్ డైరీ ఎంట్రీలు నమోదు చేశారు. ఈ కేసుల్లో 205 మంది యజమానులు లేదా వారి ప్రతినిధులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ బడుగుల సుమతి మాట్లాడుతూ, “పిల్లల చేతుల్లో పనిముట్లు కాదు… పుస్తకాలు ఉండాలి. ప్రతి చిన్నారికి సురక్షితమైన, గౌరవప్రదమైన బాల్యం అందించడం సమాజం మొత్తం బాధ్యత” అని పేర్కొన్నారు.
బాల కార్మికులు, చిన్నారుల అక్రమ రవాణా లేదా ఆపదలో ఉన్న చిన్నారుల గురించి సమాచారం తెలిసిన వెంటనే 100, 112 లేదా 1098 (చైల్డ్ హెల్ప్‌లైన్) నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలను కోరారు.
