అనాడు కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులే నేడు రైతులకు శ్రీరామరక్ష

ఎల్లంపల్లి, వరద కాలువతో రైతులకు సాగునీటి భరోసా: మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యంరెడ్డి

బాల్కొండ/మెండోరా, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు, వరద కాలువ వంటి సాగునీటి ప్రాజెక్టులే నేడు రైతులకు శ్రీరామరక్షగా నిలిచాయని వేల్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తింటి ముత్యంరెడ్డి అన్నారు.

ఆదివారం నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించడం ఆ పార్టీ దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఈ ప్రక్రియ వల్ల శ్రీరాంసాగర్ ఆయకట్టు రైతులకు సాగునీరు అందడంతో పాటు చెరువులు నిండుతున్నాయని, భూగర్భ జలాలు పెరుగుతున్నాయని తెలిపారు. దీంతో రైతులకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతోందన్నారు.

రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వరద కాలువ ద్వారా నీటిని అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో పాటు ఈ ప్రక్రియకు కృషి చేసిన ప్రజాప్రతినిధులు, నాయకులకు రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

అంతకుముందు మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మెండోరా పట్టణ అధ్యక్షుడు నోముల రాజన్న, పార్టీ నాయకులు సామ గంగారెడ్డి, వెంకట్ రెడ్డి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.