క్యాట్-2026 నోటిఫికేషన్ విడుదల…

ఆంధ్రప్రభ : దేశంలోని ప్రతిష్ఠాత్మక భారతీయ నిర్వహణ సంస్థలు (ఐఐఎంలు)తో పాటు పలు ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో ప్రవేశాలకు నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2026 నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు. ఆగస్టు 3 ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 15 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 29న దేశవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత విధానంలో మూడు విడతల్లో పరీక్ష నిర్వహించనున్నారు.

ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నవంబర్ 4 నుంచి 29 వరకు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలను 2027 జనవరి తొలి వారంలో ప్రకటించే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.

దరఖాస్తు రుసుము సాధారణ అభ్యర్థులకు రూ.2,700, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1,350గా నిర్ణయించారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో రెండు గంటల పాటు జరుగుతుంది. ఇందులో సుమారు 66 నుంచి 68 ప్రశ్నలు ఉంటాయి. భాషా నైపుణ్యం (వీఏఆర్‌సీ), డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ (డీఐఎల్‌ఆర్), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (క్యూఏ) విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

దేశవ్యాప్తంగా సుమారు 170 నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమకు అనుకూలంగా ఐదు నగరాలను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఐఐఎంలతో పాటు పలు ప్రముఖ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు క్యాట్ స్కోరు కీలకంగా ఉండటంతో, ఈ పరీక్షకు ప్రతి ఏడాది లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు.