ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్స్ పట్టివేత
- ప్రయాణికుడి బ్యాగులో 2.75 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం
- ఫుకెట్ నుంచి వచ్చిన వ్యక్తి అరెస్ట్..
- అక్రమ రవాణా కోణంలో దర్యాప్తు
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి 2.759 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకుని అతడిని అరెస్టు చేశారు.
అధికారుల వివరాల ప్రకారం, ఏపీఐఎస్ (అడ్వాన్స్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) ప్రొఫైలింగ్ ఆధారంగా అనుమానిత ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అతడు గ్రీన్ ఛానల్ దాటిన అనంతరం అడ్డుకుని అతని లగేజ్ ని ఎక్స్‌రే స్కానింగ్ చేయగా అనుమానాస్పద వస్తువులు కనిపించాయి.
దీంతో బ్యాగేజీని పూర్తిగా తనిఖీ చేయగా నాలుగు వాక్యూమ్-సీల్ ప్యాకెట్లలో 2,759 గ్రాముల హైడ్రోపోనిక్ గంజాయి లభ్యమైంది. అనంతరం మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు ఎన్‌డీపీఎస్ చట్టం–1985లోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేసి ప్రయాణికుడిని అరెస్టు చేశారు.
ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనుక ఉన్న అక్రమ రవాణా ముఠా ఎవరు? అనే కోణాల్లో కస్టమ్స్ అధికారులు దర్యాప్తును విస్తరించారు. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌తో ఏమైనా సంబంధాలున్నాయా అనే అంశాన్ని కూడా విచారిస్తున్నారు.
