నందికొట్కూరులో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వ్యర్థాలు..
ఈసారి కఠినంగా ఉంటామంటున్న మున్సిపల్ అధికారులు
11 దుకాణాల్లో విక్రయాలు
నందికొట్కూరు, ఆంధ్రప్రభ : నందికొట్కూరులో ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తామని మున్సిపల్ అధికారులు మరోసారి ప్రకటించారు. ఈసారి పక్కా ప్రణాళికతో తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అయితే గత అనుభవాల నేపథ్యంలో ప్రజలు మాత్రం ఈ ప్రకటనలపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకటనలు చేయడం, ఆ తర్వాత పట్టించుకోకపోవడం అధికారులకు అలవాటైందని విమర్శిస్తున్నారు.
పట్టణంలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతుండటంతో భవిష్యత్తులో తీవ్ర పర్యావరణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయడం అత్యవసరమని వారు సూచిస్తున్నారు.
గతంలో కూడా ప్లాస్టిక్ నిషేధంపై పలుమార్లు ప్రకటనలు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు జరగలేదు. అధికారులు నామమాత్రపు తనిఖీలు చేసి, అరకొర జరిమానాలు విధించి చేతులు దులుపుకున్నారని విమర్శలు ఉన్నాయి. ప్లాస్టిక్ వ్యాపారులు అధికారులతో చర్చలు జరిపిన అనంతరం పాలిథిన్ విక్రయాలు యథావిధిగా కొనసాగిన సందర్భాలు అనేకం ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
ప్రస్తుతం పట్టణంలో ప్లాస్టిక్ వ్యర్థాలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. పాలిథిన్ కవర్లు తిని జంతువులు మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్నాయి. దీంతో మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో పెద్ద చెరువుతో పాటు ఇతర చెరువులు కూడా పూడికపోయే పరిస్థితి నెలకొంది.
2022 నుంచే నిషేధం.. అమలులో నిర్లక్ష్యం
పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా 2022 జూలై నుంచి 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై జరిమానాలు విధించి, గోదాములు సీజ్ చేసే వరకు అధికారులు చర్యలు చేపట్టారు. అనంతరం వ్యాపారులు ఇకపై ప్లాస్టిక్ విక్రయాలు చేయబోమని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో అధికారులు సడలింపు ఇచ్చారు.
అయితే కొద్ది రోజులకే ప్లాస్టిక్ విక్రయాలు మళ్లీ ప్రారంభమైనా అధికారులు పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధుల ఒత్తిడి కారణంగా కూడా చర్యలు నిలిచిపోయినట్లు సమాచారం.
రైతుబజార్లు, కూరగాయల దుకాణాలు, కిరాణా షాపులు, మాంసం దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, పండ్ల దుకాణాల్లో ఇప్పటికీ పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసుల వినియోగం యథేచ్ఛగా కొనసాగుతోంది. నందికొట్కూరులో రోజుకు సుమారు 13 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, అందులో గణనీయమైన భాగం ప్లాస్టిక్ వ్యర్థాలేనని అధికారులు పేర్కొంటున్నారు.
అమ్మితే కఠిన చర్యలు
మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, నిషేధిత పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసుల విక్రయం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఇకపై పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తామని, నిబంధనలు ఉల్లంఘించే దుకాణాలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు.
