దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఎస్ఆర్ఆర్ రాఖీలు

ఆరు దేశాలకు సరఫరా

53 వేల రకాల డిజైన్లు
10 పైసల నుండి 500 రూపాయల వరకు
3 వేల మందికి ఉపాధి
అన్నా చెల్లెల బంధానికి మన రాఖీలు

పెద్దపల్లి ఆంధ్రప్రభ

గతంలో కలకత్తాతో పాటు రాజస్థాన్ రాఖీలు ఫేమస్.. కానీ సీన్ మారింది.. తెలంగాణ రాఖీలు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాయి. ఇక్కడి రాఖీలు దేశంలోని అన్ని రాష్ట్రాల తో పాటు 6 దేశాలకు సరఫరా అవుతున్నాయి.. ఎక్కడ చూసినా ఎస్ ఆర్ ఆర్ రాఖీలు మాత్రమే దర్శనమిస్తున్నాయి.. రాఖీల ప్రపంచానికి పెద్దపల్లి కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ తయారవుతున్న ఎస్ ఆర్ ఆర్ రాఖీలు అన్నాచెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా ఉంటున్నాయి. 53 వేల రకాల రాఖీలు పెద్దపల్లి లో లభ్యం అవుతున్నాయి. పది పైసల నుండి మొదలుకొని 500 రూపాయల రాఖీలు ఇక్కడ విక్రయిస్తున్నారు. రాఖీలు తయారు చేయడమే కాదు 3000 మందికి ఉపాధి కల్పిస్తున్న రాఖి విక్రయ కేంద్రం పై ప్రత్యేక కథనం.

12 ఏళ్ల క్రితం వరకు

12 ఏళ్ల క్రితం వరకు కలకత్తా రాజస్థాన్ నుండి మాత్రమే రాఖీలు దిగుమతి అయ్యేవి. అక్కడి వ్యాపారులు ఎంత చెబితే అంత వరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. కానీ ప్రముఖ వ్యాపారి ఇల్లందు కృష్ణ మూర్తి ఎస్ ఆర్ ఆర్ రాఖీ కేంద్రం పెద్దపల్లిలో నెలకోల్పడంతో ధరలు అమాంతం తగ్గి చౌకగా లభ్యం అవుతున్నాయి. తక్కువ ధరకు రాఖీలు దొరకడంతో దేశవ్యాప్తంగా ఇక్కడి రాఖీలే దర్శనమిస్తున్నాయి.

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖి

అన్నా చెల్లెలు.. అక్కా తమ్ముళ్లు అపురూప పర్వదినం రక్షాబంధన్. సోదర భావానికి ప్రతీక రాఖి. ఎవరి స్థాయిని బట్టి వారు రాఖీలు కొనుగోలు చేస్తారు. రకరకాల రాఖీలు కొని తమ సోదరుడికి కట్టేందుకు ఆడపిల్లలు ఆసక్తి కనబరుస్తారు. ఎంతో చూడముచ్చటైన రాఖీలు పెద్దపల్లిలోనే తయారవుతుండడం.. గతం కంటే అత్యంత చౌకగా లభ్యం అవుతుండడంతో మహిళా మణులు ఇక్కడ కొనులకు ఆసక్తి కనబరుస్తున్నారు.

10 పైసల నుండి 500 రూపాయల వరకు

పెద్దపల్లిలోని ఎస్ఆర్ఆర్ రాఖీ తయారీ కేంద్రంలో పది పైసల నుండి 500 రూపాయల వరకు రాఖీలు లభ్యమవుతున్నాయి. ఈ ఏడాది 53 వేల డిజైన్లల రాఖీలను తయారు చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రాఖీలు విక్రయించేవారు పెద్దపల్లికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. బార్ కోడింగ్ పద్ధతిలో బిల్లింగ్ చేస్తున్నారు. గతంలో పది రూపాయలకు దొరికే రాఖి ప్రస్తుతం రెండు రూపాయలకే దొరుకుతుందని ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వ్యాపారులు తెలియజేస్తున్నారు.

3 వేల మందికి ఉపాధి

రాఖీ కేంద్రం పెద్దపల్లిలో నెలకొల్పడంతో మొదట 100 మందికి ఉపాధి కల్పించగా 3 వేల మందికి పైగా ఉపాధి కల్పిస్తుంది. ఒక్కో మహిళ 300 రూపాయల నుండి 800 రూపాయల వరకు రాఖీలు తయారుచేసి సంపాదిస్తున్నారు.

దేశ విదేశాల్లో పెద్దపల్లి రాఖీలు

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్క పెద్దపల్లి లోనే రాఖీలు తయారి జరుగుతుండడం అత్యంత చౌకగా లభించడంతో దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు కూడా ఇక్కడి రాఖీలు సరఫరా అవుతున్నాయి. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, శ్రీలంక దేశాలకు రాఖీలు ఎగుమతి అవుతున్నాయి. ఆయా దేశాల్లో ఎస్ఆర్ఆర్ రాఖీలు షాపింగ్ మాల్స్ లో విక్రయిస్తున్నారు.

ధర తగ్గింది.. ఉపాధి పెరిగింది
ఇల్లందుల కృష్ణమూర్తి,
ఎస్ఆర్ఆర్ రాఖీ సెంటర్

గతంలో కలకత్తా నుండి రాఖీలు తెచ్చి విక్రయించే వాళ్ళం. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుండి ముడి సరుకులు తెచ్చి పెద్దపల్లిలోనే తయారు చేయించడంతో చౌక ధరకు రాఖీలు లభిమవుతున్నాయి. ధర అమాంతం తగ్గడంతో పాటు ఈ ప్రాంతంలోని 3 వేల మందికి పైగా ఉపాధి కల్పించడం సంతోషాన్నిస్తుంది. కలకత్తా నుండి ఇక్కడికి వచ్చి రాఖీలు కొనే పరిస్థితి వచ్చింది.

సగం ధరలకే రాఖీలు
.. ప్రవీణ్ డి.కె, వ్యాపారి, బెంగుళూరు, కర్ణాటక

పెద్దపల్లి లో రాఖీలు సగం ధరలకు లభిస్తున్నాయి. 10 సంవత్సరాల నుండి రాఖీల వ్యాపారం చేస్తున్నాను. గతంలో కలకత్తా, ఢిల్లీ, ముంబయినుండి కొనుగోలు చేసేవాడిని. నాలుగేళ్లుగా పెద్ద పెళ్లిలో రాఖీలు కొనుగోలు చేస్తున్న. కలకత్తా కంటే 60% రేట్లు తక్కువగా ఉన్నాయి. వేలాది డిజైన్ల రాఖీలు లభిస్తున్నాయి. గతంలో కంటే ఎక్కువ లాభాలు వస్తున్నాయి.