ఈ నెలలోనే పర్యటించే అవకాశం
పర్యటన షెడ్యూల్ ఖరారు చేయనున్న అధికారయంత్రాంగం
వరంగల్ విమానాశ్రయానికి భూమి పూజ
కాజీపేట రైల్‌కోచ్ ఫ్యాక్టరీ జాతికి అంకితం
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెలలో తెలంగాణలో పర్యటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యం కలిగిన రెండు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి భూమిపూజ చేయడంతో పాటు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసే కార్యక్రమాలను ఒకే వేదికపై నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర అధికార యంత్రాంగం ఏర్పాట్లు వేగవంతం చేసింది. ప్రధాని కార్యాలయం నుంచి సానుకూల సంకేతాలు అందిన నేపథ్యంలో అధికారిక పర్యటన షెడ్యూల్‌ను త్వరలో ఖరారు చేసి ప్రకటించే అవకాశముంది. తెలంగాణలో ప్రస్తుతం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే ప్రధాన విమాన సేవలను అందిస్తోంది. రాష్ట్రంలోని రెండో ప్రధాన విమానాశ్రయంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, ప్రాథమిక అనుమతులు, సన్నాహక పనులు పూర్తయ్యాయి. దీంతో విమానాశ్రయ నిర్మాణానికి అధికారికంగా శ్రీకారం చుట్టేందుకు భూమిపూజ నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉత్తర తెలంగాణ జిల్లాలకు విమాన ప్రయాణ సౌకర్యాలు మరింత చేరువ కానున్నాయి. పారిశ్రామిక, విద్యా, వైద్య, పర్యాటక రంగాలకు కూడా ఇది ఊతమివ్వనుంది.
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం
ఇక వరంగల్ సమీపంలోని మడికొండ వద్ద నిర్మితమైన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి కూడా రంగం సిద్ధమైంది. తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూసిన ఈ ప్రాజెక్టు పూర్తి కావడంతో దానిని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. 1980లలో కాజీపేటకు మంజూరైన కోచ్ ఫ్యాక్టరీ తర్వాత పంజాబ్‌కు తరలిపోవడంతో ఈ అంశం తెలంగాణ ఉద్యమంలో కీలక డిమాండ్‌గా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం తిరిగి ఈ ప్రాజెక్టును మంజూరు చేయగా, నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు అధికారిక ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
ఒకే పర్యటనలో రెండు కార్యక్రమాలు
వరంగల్ విమానాశ్రయం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఒకదానికొకటి సమీపంలో ఉండటంతో రెండు కార్యక్రమాలను ఒకే పర్యటనలో నిర్వహించాలని ప్రధాని కార్యాలయం సూచించినట్లు సమాచారం. దీనివల్ల భద్రతా ఏర్పాట్లు, అధికారిక కార్యక్రమాల నిర్వహణ మరింత సులభం కానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు పర్యటన ఏర్పాట్లపై సమన్వయం ప్రారంభించినట్లు తెలిసింది.
ప్రధాని పర్యటనకు సంబంధించిన తేదీలు, కార్యక్రమాల సమయాలు, సభా వేదిక తదితర వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ పర్యటన తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక మైలురాయిగా నిలవనుండగా, వరంగల్ ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
