అజిత్ సింగ్‌నగర్‌ను నేరరహిత ప్రాంతంగా మారుస్తాం: డీసీపీ రామకృష్ణ
- రౌడీషీటర్ల ఇళ్లపై అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు..
- బ్లేడ్ బ్యాచ్‌లపై ప్రత్యేక నిఘా..
- అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరిక
పాయకాపురం, ఆంధ్రప్రభ: అజిత్ సింగ్‌నగర్‌ను నేరరహిత ప్రాంతంగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని విజయవాడ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) జి. రామకృష్ణ స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేసే అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.
సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం నిర్వహించిన రౌడీ, కేడీ, డెకాయిట్, దొంగలు, సస్పెక్ట్ షీటర్ల కౌన్సెలింగ్ కార్యక్రమంలో డీసీపీ రామకృష్ణ మాట్లాడారు. న్యూ రాజరాజేశ్వరి పేట, లూనా సెంటర్, లెనిన్ సెంటర్, రామానగర్, ఎక్సెల్ ప్లాంట్ తదితర సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు నిఘాను మరింత ముమ్మరం చేశామని తెలిపారు.
ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న బ్లేడ్ బ్యాచ్ సభ్యులపై ప్రత్యేక దృష్టి సారించామని, వారి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఇటువంటి ముఠాలకు చెందిన వారు పట్టుబడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు.
పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత నేరస్థులు, రౌడీషీటర్ల కదలికలను ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నామని డీసీపీ తెలిపారు. రాత్రి వేళల్లో రౌడీషీటర్లు తమ ఇళ్లలోనే ఉన్నారా? లేక అసాంఘిక కార్యకలాపాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారా? అనే కోణంలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు (కార్డన్ అండ్ సెర్చ్) నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించినా, అనవసర గొడవలకు పాల్పడి శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా వారిపై వెంటనే కొత్త రౌడీషీట్లు తెరవడంతో పాటు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేర చరిత్ర ఉన్న ప్రతి ఒక్కరిపై 24 గంటలూ నిఘా కొనసాగుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఏసీపీ (నార్త్) సత్యానందం, సీఐ చంద్రశేఖర్‌తో పాటు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు
