సమ సమాజ నిర్మాణమే ఎమ్మార్పీఎస్ లక్ష్యం

ఎస్సీ వర్గీకరణ ఉద్యమ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగించాలి

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: మత దురహంకారం, కుల వివక్ష, సామాజిక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణమే ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రధాన లక్ష్యమని హనుమకొండ జిల్లా ఇంచార్జి ఏపూరి వెంకటేశ్వర్ రావు మాదిగ అన్నారు.

ఆదివారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఎల్కతుర్తి మండల ఇంచార్జి అడ్డూరి అనిల్ మాదిగ అధ్యక్షతన ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, అనుబంధ విభాగాల జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా ఇంచార్జి ఏపూరి వెంకటేశ్వర్ రావు మాదిగ, జిల్లా కో-ఇంచార్జి తడుగుల విజయ్ మాదిగ, ఎంఎస్పీ మాజీ జిల్లా అధ్యక్షుడు బండారి సురేందర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు గద్దల సుకుమార్ మాదిగ మాట్లాడుతూ, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మూడు దశాబ్దాలుగా సాగిన రాజీలేని ఉద్యమ ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని పేర్కొన్నారు.

మాదిగలతో పాటు పేద, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం ఎమ్మార్పీఎస్ చేపట్టిన ఉద్యమాలు సామాజిక న్యాయ సాధనలో కీలక పాత్ర పోషించాయని తెలిపారు. దేశంలో ఇప్పటికీ కొనసాగుతున్న కుల వివక్ష కారణంగా అణగారిన వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల్లో రాజకీయ చైతన్యం పెంపొందించి గ్రామస్థాయిలో ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్మించాలని సూచించారు. ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, అనుబంధ విభాగాల కమిటీలను గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పునర్వ్యవస్థీకరించి సంస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

విద్యార్థులు, యువతను ఉద్యమంలో భాగస్వామ్యం చేసి క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వాన్ని తీర్చిదిద్దాలని, మహనీయుల ఆశయాల సాధన, పీడిత వర్గాల విముక్తి, సామాజిక న్యాయం కోసం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సూచించిన ఉద్యమ కార్యాచరణను విజయవంతం చేయాలని ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో నూతన కమిటీల నిర్మాణాన్ని వేగవంతం చేసి ఉద్యమాన్ని మరింత విస్తరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు బొంకూరి వంశీ మాదిగ, ఎల్తూరి సురేష్ మాదిగ, బొంకూరి కార్తీక్ మాదిగ, మేకల రవీందర్ మాదిగ, అంబాల సంపత్ మాదిగ, మారుపాక రవీందర్ మాదిగ, అడ్డూరి నవీన్ మాదిగ, అడ్డూరి ప్రశాంత్ మాదిగ, గ్రామ శాఖ అధ్యక్షులు అడ్డూరి శ్రీకాంత్ మాదిగ, గంగారపు రాజ్ మాదిగ, ఆరెపల్లి శ్రీనివాస్ మాదిగ, ఎర్రోళ్ల అనిల్ మాదిగ, రాజ్ కొమురయ్య మాదిగ, శనిగరపు వంశీ మాదిగతో పాటు వివిధ గ్రామాల నుంచి ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సమావేశాన్ని విజయవంతం చేసిన అన్ని గ్రామాల ఎమ్మార్పీఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులకు ఎమ్మార్పీఎస్ ఎల్కతుర్తి మండల ఇంచార్జి అడ్డూరి అనిల్ మాదిగ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.