పసికందు అమ్మకం?
రూ.5.5 లక్షలకు శిశువు విక్రయం?
పసికందు అమ్మకం యత్నం భగ్నం
శిశువును కాపాడిన పోలీసులు
ఉచ్చుపన్ని నిందితురాలి అరెస్ట్
అక్రమ రవాణా కోణంలో దర్యాప్తు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : నాలుగు రోజుల నవజాత శిశువును రూ.5.50 లక్షలకు విక్రయించేందుకు జరిగిన యత్నాన్ని బాలాపూర్ పోలీసులు భగ్నం చేశారు. సామాజిక కార్యకర్త సఫియా మాహీ సహకారంతో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో పసికందును సురక్షితంగా రక్షించి, ఈ వ్యవహారంలో చంద్రాయణగుట్టకు చెందిన వహీదా ఖాతూన్‌ను అరెస్టు చేశారు. చిన్నారుల అక్రమ రవాణా కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాహిన్‌నగర్‌కు చెందిన మెహెరున్నిసాకు మూడు నెలల క్రితం బర్కాస్ ప్రాంతానికి చెందిన వహీదా ఖాతూన్ పరిచయమైంది. పిల్లలు కావాలంటే తాను ఏర్పాటు చేస్తానని ఆమె చెప్పడంతో, మెహెరున్నిసా దంపతులు సామాజిక కార్యకర్త సఫియా మాహీని సంప్రదించారు. అనంతరం ఆమె సహకారంతో బాలాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో అధికారులు ప్రత్యేక వ్యూహం రచించారు.
దర్యాప్తులో తొలుత నవజాత శిశువును రూ.7 లక్షలకు విక్రయించాలని మాట్లాడుకుని, అనంతరం రూ.5.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు గుర్తించారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖుబా కాలనీలోని జేజీఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ సమీపంలో లావాదేవీ జరగనున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు కొనుగోలుదారుల వేషంలో వెళ్లి ఉచ్చు పన్నారు. నిందితులు నాలుగు రోజుల పసికందును అప్పగిస్తున్న సమయంలో వారిని అదుపులోకి తీసుకుని శిశువును రక్షించారు.
విచారణలో పాతబస్తీ రియాసత్‌నగర్‌కు చెందిన అఫ్రీన్ బేగం ఇటీవల మలక్‌పేట్ ఏరియా ఆసుపత్రిలో ఆడశిశువుకు జన్మనిచ్చినట్లు గుర్తించారు. ఆ చిన్నారిని అక్కడి నుంచి ఎలా తీసుకువచ్చారు? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
రక్షించిన శిశువును యూసఫ్‌గూడలోని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించి సంరక్షణ కల్పించారు.
