ఇంద్రకీలాద్రి పై భక్తజన సందోహం..
- దసరాను తలపించిన ఆషాఢ సారె వైభవం
- 19వ రోజు రికార్డు స్థాయిలో 79 సారె బృందాలు
- ఆదివారం 90 వేల మంది భక్తుల రాక
- 29,567 మంది మహిళా భక్తుల సారె సమర్పణ
- అస్వస్థతకు గురైన భక్తులకు తక్షణ వైద్యసాయం
- క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించిన ఈవో శీనా నాయక్
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: ఆషాఢ మాస సారె ఉత్సవాల 19వ రోజు ఇంద్రకీలాద్రిపై భక్తుల వెల్లువ దసరా మహోత్సవాలను తలపించింది. రికార్డు స్థాయిలో 79 సారె బృందాలు అమ్మవారికి సారె సమర్పించగా, ఆదివారం ఒక్కరోజే 90 వేల కు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భారీ రద్దీ మధ్య అస్వస్థతకు గురైన భక్తులకు తక్షణ వైద్యసాయం అందిస్తూ, దర్శన ఏర్పాట్లను ఈవో వి.కె. శీనా నాయక్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
కిటకిటలాడిన క్యూ లైన్లు
శ్రీ కనకదుర్గమ్మను ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి మహిళా భక్తులు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, సారెలతో ఇంద్రకీలాద్రికి భారీగా తరలివచ్చారు. మంగళవాయిద్యాలు, కోలాటాలతో అమ్మవారి నామస్మరణ చేస్తూ ఆలయానికి చేరుకున్న భక్తులతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది.
దేవస్థానం వివరాల ప్రకారం, ఆదివారం 79 సారె బృందాలకు చెందిన 29,567 మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పించారు. ఈ ఏడాది అత్యధిక సారె బృందాలు నమోదవడం విశేషం. భక్తుల రద్దీ దృష్ట్యా ఉదయం 9 గంటల నుంచే అన్ని దర్శనాలను ఉచితంగా అనుమతించడంతో పాటు సారె బృందాలకు ప్రత్యేక ఉచిత దర్శనం, వేద పండితుల ఆశీర్వచనాలు అందించే ఏర్పాట్లు చేశారు. ఆదివారం 90 వేల కు పైగా మంది భక్తులు అమ్మవారి దర్శనానికి విచ్చేసినట్లు దేవస్థానం అంచనా వేసింది.
భారీ రద్దీ నేపథ్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ఉదయం నుంచే ఘాట్ రోడ్డు, దుర్గా ఘాట్, కేశఖండనశాల, క్యూ లైన్లు, తాగునీటి సరఫరా, భక్తుల సౌకర్యాలపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు.
అస్వస్థకు గురైన భక్తులు..
ఒకవైపు క్యూలైన్లలో రద్దీ, మరోవైపు మండుటెండలతో క్యూ లైన్లలో కొందరు భక్తులు అస్వస్థతకు గురికావడాన్ని సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన ఈవో వెంటనే వారిని బయటకు తరలించి దేవస్థానం ప్రథమ చికిత్స కేంద్రంలో వైద్యసాయం అందేలా చర్యలు చేపట్టారు. విధుల్లో ఉన్న కొందరు భద్రతా సిబ్బందికి కూడా అస్వస్థత కలగడంతో వారికి తక్షణ చికిత్స అందించారు. భక్తులకు క్యూ లైన్లలో బిస్కెట్ ప్యాకెట్లు, తాగునీటిని పంపిణీ చేయగా, ఏసీపీ దుర్గారావు, వన్‌టౌన్ సీఐ గుణరామ్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు నిర్వహించి దర్శనాన్ని సజావుగా సాగించారు.
