3 Demands | 3 డిమాండ్లు పెట్టిన సీజేపీ

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరిన ప్రతినిధులు
పరిహారం, కేసుల ఎత్తివేతకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం?

3 Demands | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, సీజేపీ నాయకుల మధ్య ఇవాళ‌ ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సుదీర్ఘ చర్చలు జరిగాయి. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో దాదాపు రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో సీజేపీ ప్రతినిధులు మూడు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.

విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ పేపర్ లీక్ ఘటన నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం అందించాలని, ఆందోళనకారులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు.

సమావేశం అనంతరం సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రి రాజీనామా అంశంపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం వరకు గడువు కోరినట్లు తెలిపారు. అలాగే, మంత్రి రాజీనామా డిమాండ్ మినహా మిగిలిన రెండు డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు వారు వెల్లడించారు. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.