విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ చంద్రయ్య
చెన్నూర్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సౌకర్యవంతమైన వసతి, పౌష్టికాహారం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య అన్నారు.
ఆదివారం చెన్నూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని మండల తహసీల్దార్ మల్లికార్జున్, మండల విద్యాధికారితో కలిసి ఆయన సందర్శించారు. విద్యార్థినులకు కల్పిస్తున్న సౌకర్యాలు, తాగునీటి వసతి, పారిశుద్ధ్యం, తరగతి గదులు, వసతి గృహాలు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు.
అనంతరం విద్యార్థినులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. విద్యార్థినుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోషకాహార ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన ఆహారాన్ని నిరంతరం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
భోజనశాలను పరిశీలించిన అదనపు కలెక్టర్, అందుబాటులో ఉన్న సౌకర్యాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. విద్యాలయ ప్రాంగణంలో ఉన్న డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెన్నూర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా విద్యాలయానికి వచ్చిన తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మెరుగైన విద్య, భద్రత, వసతి, పోషకాహారం అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, పౌష్టికాహారం అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
