ఆగస్టు 14 వరకు దరఖాస్తుల స్వీకరణ
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఎస్సీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అర్హులైన యువత కోసం ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కల్పన తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన 17 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల అవివాహిత యువత ఈ శిక్షణకు అర్హులని తెలిపారు.
ఆరు నెలల పాటు నిర్వహించే ఈ శిక్షణకు మొత్తం ఫీజు రూ.1.42 లక్షలు కాగా, అభ్యర్థులు హాస్టల్ ఫీజుగా నెలకు రూ.5,500 చొప్పున ఆరు నెలలకు రూ.33 వేలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. మిగిలిన రూ.1.09 లక్షల శిక్షణ వ్యయాన్ని జిల్లా కలెక్టర్ భరిస్తారని తెలిపారు.
శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులకు దేశంలోని విమానాశ్రయాల్లో ప్యాసింజర్ సర్వీస్ అసిస్టెంట్, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సర్వీస్, డిజి బడ్డీ తదితర విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన వారికి ప్రారంభ వేతనం రూ.18 వేల నుంచి రూ.25 వేల వరకు ఉండే అవకాశం ఉందన్నారు.
అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కోరారు. దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 14 చివరి తేదీగా తెలిపారు. మరిన్ని వివరాల కోసం 99639 60063, 86881 06554 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
