వైభవంగా మహా అగ్ని చయన యజ్ఞం…

ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమా..

వీరులపాడు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలోని శ్రీ యజ్ఞ దత్తాత్రేయ క్షేత్రంలో ప్రజా శ్రేయస్సు, లోకక్షేమం కోసం జ్యేష్ఠ శుద్ధ చవితి నుంచి జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకు 12 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన ప్రథమ సహస్ర సర్వపృష్ఠ మహా అగ్ని చయన యజ్ఞం ముగింపు కార్యక్రమంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, జుజ్జూరులో తరతరాలుగా కొనసాగుతున్న ఈ మహా వైదిక యజ్ఞ సంప్రదాయం భారతీయ సనాతన ధర్మ వైభవానికి ప్రతీక అని అన్నారు. మద్దూరు వెంకటేశ్వర యాజులు గారి పూర్వీకులు ప్రారంభించిన ఈ యజ్ఞ సంప్రదాయాన్ని యజ్ఞ నారాయణ వాజపేయ యాజులు గారు నేటికీ భక్తిశ్రద్ధలతో కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు. వేదాలు యజ్ఞాలకు అత్యున్నత స్థానం కల్పించాయని, ప్రకృతి సమతుల్యత, సమృద్ధిగా వర్షాలు, ప్రజల శాంతి, సౌభాగ్యం, లోకక్షేమం కోసం ఇటువంటి మహా వైదిక క్రతువులు నిర్వహించడం విశేషమని అన్నారు. జుజ్జూరు వేదికగా ఇంతటి పవిత్ర యజ్ఞం నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొంటూ, యజ్ఞాన్ని విజయవంతంగా నిర్వహించిన యాజ్ఞికులు, వేదపండితులు, నిర్వాహకులను దేవినేని ఉమా అభినందించారు.