ఆంధ్రప్రభ కథనంతో కదిలిన యంత్రాంగం

  • ఇద్దరు అధికారులు సస్పెండ్

మరిపెడ, ఆంధ్రప్రభ: ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో మరిపెడలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఏపీవో భీమా నాయక్, ఇన్‌చార్జి ఈసీ భూక్య నెహ్రూ నాయక్‌లను సస్పెండ్ చేస్తూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు సంచాలకుడు మధుసూదన్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇటీవల ఆంధ్రప్రభలో ప్రచురితమైన వార్తా కథనానికి స్పందించిన ఉన్నతాధికారులు, వీరిపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమేనని తేలడంతో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నట్లు ప్రాజెక్టు సంచాలకుడు మధుసూదన్ రాజ్ తెలిపారు.విచారణ పూర్తయ్యే వరకు ఇద్దరు అధికారులను విధుల నుంచి తప్పిస్తూ సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.