లివ్ఇన్‌లో వేధింపులా? సుప్రీంకోర్టు సంచలన తీర్పు

న్యూఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ‌ : దేశవ్యాప్తంగా సహజీవన (లివ్ఇన్‌) సంబంధాలకు సంబంధించిన కేసుల్లో కీలక ప్రభావం చూపేలా సుప్రీంకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. సహజీవన సంబంధాల్లో మహిళలు శారీరక లేదా మానసిక వేధింపులకు గురైతే (ఐపీసీ) సెక్షన్ 498ఏ కింద కేసు నమోదు చేయవచ్చని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ నోంగ్‌మీకపమ్ కోటిశ్వర్ సింగ్ల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.

గృహ హింస, మహిళలపై జరిగే మానసిక లేదా శారీరక వేధింపులను అరికట్టడమే సెక్షన్ 498A ఉద్దేశ్యం అయితే, కేవలం చట్టబద్ధమైన వివాహం జరగలేదన్న కారణంతో ‘లివ్-ఇన్’ సంబంధాలలో ఉన్న మహిళలకు ఈ రక్షణను నిరాకరించడం అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కల్పించే సమానత్వ హక్కును ఉల్లంఘించడమేనని న్యాయస్థానం పేర్కొంది.

అయితే, ఈ తీర్పు ప్రతి ‘లివ్-ఇన్’ సంబంధానికి వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాహం చేసుకోవాలనే స్పష్టమైన ఉద్దేశం ఉండి, వివాహంతో సమానమైన స్వభావం కలిగిన ‘లివ్-ఇన్’ సంబంధాలకు మాత్రమే సెక్షన్ 498A వర్తిస్తుందని కోర్టు పేర్కొంది. అలాగే, పరస్పర అంగీకారంతో కలిసి జీవిస్తున్న ఇద్దరు వయోజనులకు మాత్రమే ఈ రక్షణ వర్తిస్తుందని కూడా అది స్పష్టం చేసింది.

కర్ణాటక హైకోర్టు తీర్పుకు మద్దతు

ఈ కేసులో తనకు చట్టబద్ధమైన వివాహం కాలేదని, అందువల్ల 498ఏ వర్తించదని ఓ వ్యక్తి వాదించాడు. అయితే కర్ణాటక హైకోర్టు ఆ వాదనను తిరస్కరించి విచారణ కొనసాగించాలని ఆదేశించింది. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రత్యేక అనుమతి పిటిషన్‌ను సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది.

వ్యక్తిగత స్వేచ్ఛ, భాగస్వామిని ఎంచుకునే హక్కుకు సంబంధించిన గత తీర్పులను ప్రస్తావిస్తూ, ‘లివ్-ఇన్’ సంబంధాలలో ఉన్న మహిళలకు చట్టపరమైన రక్షణ లేకపోవడం సమంజసం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. “వివాహ బంధంలో వేధింపుల నుండి మహిళకు రక్షణ లభించి, అదే తరహా స్వభావం కలిగిన ‘లివ్-ఇన్’ సంబంధంలో అటువంటి రక్షణ నిరాకరించబడితే, అది వివక్ష చూపడమే అవుతుంది” అని న్యాయస్థానం పేర్కొంది.