నరేంద్ర మోదీతో నరసరావుపేట ఎంపీ భేటీ
- ‘క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్’పై సమగ్ర నివేదిక అందజేత
నరసరావుపేట, ఆంధ్రప్రభ: నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు సోమవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లాలో నిర్వహించిన ‘క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్’ ద్వారా సాధించిన ప్రగతిని వివరిస్తూ రూపొందించిన ‘పల్నాడు: ఎ క్రానికల్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్’ నివేదికను ప్రధానికి అందజేశారు.
జూలై 17న పల్నాడు జిల్లా, నరసరావుపేట కేంద్రంగా నిర్వహించిన క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ ద్వారా జిల్లాలో సాధించిన ఆర్థికాభివృద్ధి వివరాలను ఎంపీ ప్రధానికి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 1,03,246 మంది లబ్ధిదారులకు రూ.3,216 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. వీరిలో 70 వేల మందికి పైగా తొలిసారిగా రుణ సదుపాయం పొందిన లబ్ధిదారులే కావడం విశేషమని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ 83,365 మంది రైతులకు రూ.2,286 కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరు చేసినట్లు ఎంపీ వివరించారు. అలాగే మహిళలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు), యువత, చేతివృత్తుల వారు, స్వయం సహాయక సంఘాలకు విస్తృతంగా ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.
భవిష్యత్తులో వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, మౌలిక సదుపాయాలు, ఉద్యోగ కల్పన రంగాల్లో పల్నాడు జిల్లాను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రధాని మోదీకి వివరించారు.
పల్నాడు జిల్లాలో గ్రామీణ స్థాయిలో ఆర్థిక వృద్ధిని పెంచేందుకు, స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు చేపట్టిన కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. గ్రామీణ సాధికారతతో పాటు ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
