మంత్రి ముందుకు 10 ప్రతిపాదనలు

హైదరాబాద్, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన నిర్వహించిన నిజామాబాద్ జిల్లా ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో నియోజకవర్గాల వారీగా ఆరోగ్య సేవలు, ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు, మౌలిక వసతులు, మందుల లభ్యత, వైద్యులు, సిబ్బంది కొరత, ప్రజారోగ్య సేవల మెరుగుదల వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన పలు ఆరోగ్య అవసరాలను మంత్రి దామోదర రాజనరసింహ దృష్టికి తీసుకెళ్లిన ప్రశాంత్ రెడ్డి, మొత్తం 10 కీలక ప్రతిపాదనలను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.

  • ప్రధాన ప్రతిపాదనలు
  • భీంగల్‌లో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఏరియా ఆస్పత్రి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి.
  • భీంగల్ పీహెచ్‌సీని రాహత్‌నగర్‌కు తరలించి, అక్కడ కొత్త పీహెచ్‌సీ భవనానికి అనుమతులు ఇవ్వాలి.
  • భీంగల్‌లో కొత్త పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ) ఏర్పాటు చేయాలి.
  • మోర్తాడ్ మండలంలోని పాలెం లేదా తిమ్మాపూర్‌లో కొత్త పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలి.
  • బాల్కొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు కొత్త భవనం నిర్మించాలి.
  • బాల్కొండ, మోర్తాడ్‌లలో పోస్ట్‌మార్టం భవనాలు నిర్మించాలి.
  • పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
  • 9 ఉపకేంద్రాల పెండింగ్ ఎన్‌హెచ్‌ఎం నిధులను విడుదల చేయాలి.
  • 18 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణానికి అనుమతులు, నిధులు మంజూరు చేయాలి.
  • నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి ఎంఆర్ఐ యంత్రం, అదనపు నిధులు, ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే ఈ ప్రతిపాదనలను త్వరితగతిన అమలు చేయాలని ప్రశాంత్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.