నందికొట్కూరు 13వ వార్డులో రేపు ఎమ్మెల్యే పర్యటన
నందికొట్కూరు, ఆంధ్రప్రభ: నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య మంగళవారం ఉదయం 8 గంటలకు నందికొట్కూరు మున్సిపాలిటీ 13వ వార్డులో పర్యటించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ముందుగా 13వ వార్డులో నిర్వహించే ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయంతో అమలు చేస్తోందని ఎమ్మెల్యే ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు.
రెండేళ్ల పాలనలో పేదల సంక్షేమం, రైతుల భరోసా, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, విద్యార్థులకు విద్యా ప్రోత్సాహకాలు, వృద్ధులకు పెన్షన్ల పెంపు, గృహ నిర్మాణాలు, తాగునీటి పథకాలు, రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు చేరాయని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని ఎమ్మెల్యే వివరిస్తారని కమిషనర్ పేర్కొన్నారు.
అలాగే టీడీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శక పాలన, అవినీతి రహిత సంక్షేమ పంపిణీ, వేగవంతమైన అభివృద్ధి పనులు జరుగుతున్న తీరును ప్రజలకు తెలియజేయనున్నట్లు చెప్పారు.
కార్యక్రమం అనంతరం 13వ వార్డులో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే గిత్త జయసూర్య భూమిపూజ చేసి పనులను ప్రారంభిస్తారు.
ఈ రెండు కార్యక్రమాలకు వివిధ శాఖల అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా హాజరుకావాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది. రెండేళ్ల పాలనలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును ఎమ్మెల్యే స్వయంగా ప్రజలకు వివరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
