మైనార్టీ గురుకుల హాస్టల్‌లో దారుణం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా బౌరంపేట్‌లోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల హాస్టల్‌లో పదేళ్ల బాలుడిపై సీనియర్ విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాధిత బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట శ్రీనివాసనగర్‌కు చెందిన ఎండీ బిలాల్ కుమారుడు బౌరంపేట్‌లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల (శేరిలింగంపల్లి బాయ్స్-1)లో ఐదో తరగతి చదువుతూ హాస్టల్‌లో ఉంటున్నాడు. గత జూలై 27 రాత్రి హాస్టల్‌లో విద్యార్థులంతా నిద్రిస్తున్న సమయంలో అదే హాస్టల్‌కు చెందిన ముగ్గురు సీనియర్ విద్యార్థులు బాలుడిని బలవంతంగా నిద్రలేపి లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన బాలుడు వెంటనే ఎవరికీ చెప్పలేకపోయాడు.

ఆగస్టు 1న తండ్రి బిలాల్ తన ఇద్దరు కుమారులను హాస్టల్ నుంచి ఇంటికి తీసుకెళ్లగా, ఇంటికి చేరిన తర్వాత బాధిత బాలుడు తల్లికి జరిగిన విషయాన్ని తెలిపాడు. అనంతరం తండ్రి పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు నిందితులైన ముగ్గురు విద్యార్థులపై పోక్సో కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ ఎం. బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనతో గురుకుల హాస్టళ్లలో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.