మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి

హైదరాబాద్, ఆంధ్రప్రభ: దివంగత తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి బతికున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనను నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు ఆయన మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని పొంగులేటి విమర్శించారు.

పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమకారుడైన సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదని, ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవిని కూడా కేటాయించలేదని ప్రశ్నించారు. అదే సమయంలో ఇతర నేతలకు కీలక పదవులు ఇచ్చిన బీఆర్ఎస్.. సుదర్శన్‌రెడ్డిని ఎందుకు విస్మరించిందని నిలదీశారు. సుదర్శన్‌రెడ్డి అనారోగ్యానికి గురైన సమయంలో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తరలించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసిందని, ఆయన అంత్యక్రియలను అధికారిక పోలీసు లాంఛనాలతో నిర్వహించి గౌరవించిందని గుర్తు చేశారు.

ఉద్యమకారులను ఎన్నికల సమయంలో మాత్రమే ఉపయోగించుకుని, అధికారాలు మాత్రం ఒకే కుటుంబానికి పరిమితం చేశారని బీఆర్ఎస్‌పై పొంగులేటి విమర్శలు గుప్పించారు. మరణాలను కూడా రాజకీయ లబ్ధి కోసం వినియోగించడం దురదృష్టకరమని, ప్రజలు దీనికి తగిన సమయంలో సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.