మహంకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్, ఆంధ్రప్రభ: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల వేడుకల్లో జోగినీ శ్యామల దేవి తలపై ఉన్న బోనం కిందపడిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనకు ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ జోగినీలు ఆలయం వద్ద ఆందోళనకు దిగారు. నిరసన తెలపడానికి వచ్చిన జోగినీలను బాటా కమాన్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

సాంప్రదాయాలకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయలేదని, తమను అవమానించారని జోగినీలు ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన సమయంలో జోగినీ శ్యామల దేవి అస్వస్థతకు గురై స్పృహ తప్పడంతో అక్కడ మరింత ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఆమెకు వెంటనే వైద్యసాయం అందించినట్లు సమాచారం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయం పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితిని పర్యవేక్షిస్తూ శాంతిభద్రతలు కాపాడేందుకు చర్యలు చేపట్టారు.