శాకంభరీ ఉత్సవాల దాతలకు అభినందనలు

  • ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనంతో సన్మానం
  • కూరగాయలు, పండ్లు విరాళంగా అందించిన దాతలకు ప్రత్యేక గౌరవం
  • దాతలకు ధన్యవాదాలు తెలిపిన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్
  • కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి ప్రత్యేక దర్శనం, ప్రసాదాల అందజేత
  • శాకంభరీ ఉత్సవాల విజయానికి దాతల సహకారం ఎనలేనిదని ప్రశంస
  • దేవస్థానం కల్పించిన గౌరవంపై హర్షం వ్యక్తం చేసిన దాతలు

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: ఇటీవల అత్యంత వైభవంగా నిర్వహించిన శాకంభరీ మహోత్సవాలు–2026 విజయవంతానికి తోడ్పాటునందించిన దాతలకు ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ప్రత్యేక సత్కారం నిర్వహించింది. అమ్మవారి అలంకరణ కోసం కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు భక్తిశ్రద్ధలతో విరాళంగా అందించిన దాతలకు ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం కల్పించి ఆలయ మర్యాదలతో ఘనంగా సన్మానించింది.
సోమవారం పెద్ద రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ దాతలను కలిసి ఉత్సవాల విజయానికి అందించిన విశేష సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం దాతలను, వారి కుటుంబ సభ్యులను శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ప్రత్యేక దర్శనానికి తీసుకెళ్లి, దర్శనానంతరం వేదపండితులతో వేదాశీర్వచనం నిర్వహించారు. ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, పవిత్ర ప్రసాదాలు అందజేసి గౌరవించారు.

దాతల సహకారం మరువలేనిది..

ఈ సందర్భంగా చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్ మాట్లాడుతూ, మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన శాకంభరీ ఉత్సవాల్లో అమ్మవారి అలంకరణకు దాతలు అందించిన కూరగాయలు, పండ్లు ఉత్సవాలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయని కొనియాడారు. దాతల సహకారంతోనే ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించగలిగామని పేర్కొన్నారు. దేవస్థానం కల్పించిన ప్రత్యేక దర్శనం, గౌరవ సత్కారం పట్ల దాతలు హర్షం వ్యక్తం చేస్తూ ఆలయ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యుడు బడేటి ధర్మారావు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.