Kesineni chinni | ఐదేళ్లలో రూ.1,465 కోట్ల కేంద్ర నిధులు

  • ఎంపీ చిన్ని ప్రశ్నకు కేంద్రం వెల్లడి
  • 2021-22 నుంచి 2025-26 వరకు రూ.1,465.40 కోట్లు విడుదల
  • జిల్లాల వారీగా పాఠశాలలు, పర్యవేక్షణ కమిటీల వివరాలు సభలో వెల్లడి
  • స్టీరింగ్ అండ్ మానిటరింగ్ కమిటీల సమావేశాలపై నివేదిక సమర్పణ
  • పోషకాహార పథకం అమలుపై పార్లమెంట్‌లో కీలక సమాచారం వెలుగులోకి

విజయవాడ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమంత్రి పోషణ పథకం అమలుకు గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.1,465.40 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి ఈ వివరాలను సభకు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ప్రధానమంత్రి పోషణ పథకంపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) లోక్‌సభలో లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర వివరాలు వెల్లడించింది.

రాష్ట్రంలో పథకం అమలవుతున్న పాఠశాలల సంఖ్య, జిల్లా స్థాయి స్టీరింగ్ అండ్ మానిటరింగ్ కమిటీల ఏర్పాటు, వాటి సమావేశాలు, గత ఐదేళ్లలో విడుదల చేసిన కేంద్ర నిధుల వివరాలను కేంద్ర విద్యాశాఖ సభలో వెల్లడించింది. కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సమాధానమిస్తూ, బాలవాటిక నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రధానమంత్రి పోషణ పథకం అమలవుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం ఆధారంగా జిల్లాల వారీగా పాఠశాలల సంఖ్యతో పాటు స్టీరింగ్ అండ్ మానిటరింగ్ కమిటీల సమావేశాల వివరాలను లోక్‌సభకు సమర్పించినట్లు పేర్కొన్నారు.

2021-22 నుంచి 2025-26 వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.1,465.40 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఇందులో 2021-22లో రూ.357.31 కోట్లు, 2022-23లో రూ.365.32 కోట్లు, 2023-24లో రూ.253.43 కోట్లు, 2024-25లో రూ.239.07 కోట్లు, 2025-26లో రూ.250.27 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పీఎం పోషణ పథకం అమలవుతున్న పాఠశాలల సంఖ్యతో పాటు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీల పనితీరు, సమావేశాల వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా లోక్‌సభ ముందుంచింది. ఎంపీ కేశినేని శివనాథ్ లేవనెత్తిన ప్రశ్నతో రాష్ట్రంలో పోషకాహార పథకం అమలు, కేంద్ర నిధుల కేటాయింపుపై కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.