విలువల విద్యే విజయానికి బాట
- వ్యక్తిత్వ వికాసమే నిజమైన విద్య లక్ష్యం
- చాగంటి కోటేశ్వరరావు
- కృష్ణా విశ్వవిద్యాలయంలో నైతిక విలువల సదస్సు
మచిలీపట్నం, ఆంధ్రప్రభ: విలువలు, సంస్కారం, వ్యక్తిత్వ వికాసంతో కూడిన విద్యనే మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించిన “విద్యార్థి సౌశీల్య వికాసం – నైతిక విలువలు” సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
విద్య అనేది కేవలం ఉద్యోగం సంపాదించడానికి మాత్రమే కాదని, మంచి మనిషిగా తీర్చిదిద్దే శక్తి కూడా విద్యకే ఉందన్నారు. చదువు, సంస్కారం ఒకే నాణానికి రెండు వైపులని, నిజమైన విద్య మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన ఆలోచనల్లో ప్రతిబింబించాలని పేర్కొన్నారు. వినయం, క్రమశిక్షణ, బాధ్యత, పరస్పర గౌరవం కలిగిన వ్యక్తులే సమాజంలో చిరస్థాయిగా నిలుస్తారని చెప్పారు.
పదవి అనేది పదిమందికి ఉపయోగపడేలా ఉండాలని, గర్వం, అహంకారంతో సంపాదించిన పేరు కంటే వినయంతో సంపాదించిన గౌరవమే శాశ్వతమన్నారు. ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఆలోచించి మాట్లాడే వరం మనిషికే దక్కిందని, అందుకే ప్రతి మాట ఎదుటివారికి ప్రేరణనిచ్చేలా, హృదయాలను గెలుచుకునేలా ఉండాలని సూచించారు. మంచి మాటలు మాట్లాడలేని వ్యక్తి సమాజానికి ఉపయోగపడని నిర్మానుష్య భవనం వంటివాడని వ్యాఖ్యానించారు.
శాస్త్రవేత్తలు తమ వ్యక్తిగత జీవితాన్ని సమాజ శ్రేయస్సుకు అంకితం చేయడం వల్లే దేశం విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో ముందుకు సాగుతోందని కొనియాడారు. యువత భావోద్వేగాలకు లోనుకాకుండా సంయమనంతో వ్యవహరించాలని, ఒక క్షణిక నిర్ణయం జీవితాన్నే మార్చివేయగలదని హెచ్చరించారు. చట్టాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, పోలీసులు కూడా సమాజ సేవకులేనని, వారికి కూడా కుటుంబాలు, భావోద్వేగాలు ఉంటాయని గుర్తుంచుకోవాలని సూచించారు.
విద్యార్థులు వ్యక్తిత్వ విలువలను అలవర్చుకోవడం వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, కుటుంబం, సమాజంలో గౌరవం లభిస్తుందని, క్లిష్ట పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుందని చాగంటి వివరించారు. నిజాయితీ, సేవాభావం, క్రమశిక్షణ, సమయపాలన వంటి విలువలు విద్యార్థులను భవిష్యత్తులో ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు. నైతిక విలువలు ఉన్న యువతే దేశానికి నిజమైన సంపద అని, అలాంటి తరం దేశాభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని అన్నారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ వ్యక్తిత్వం లేని విద్య అసంపూర్ణమని, ఎన్ని ఉన్నత విద్యార్హతలు సాధించినా మంచి విలువలు లేకపోతే వాటికి ప్రయోజనం ఉండదన్నారు. పెద్దల అనుభవాలను గౌరవిస్తూ వారి సూచనలను ఆచరిస్తేనే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని తెలిపారు.
ఉపకులపతి ఆచార్య కె. రాంజీ మాట్లాడుతూ విద్యార్థులను సామాజిక బాధ్యత కలిగిన సత్పౌరులుగా తీర్చిదిద్దడమే విశ్వవిద్యాలయం లక్ష్యమని చెప్పారు. విద్యతో పాటు నైతిక విలువలు, సేవాభావం, సామాజిక చైతన్యం పెంపొందించే కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమానికి తొలుత చాగంటి కోటేశ్వరరావుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం విశ్వవిద్యాలయం తరఫున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య ఎం.వి. బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, ఆచార్య వై.కె. సుందరకృష్ణ, ఆచార్య మారుతి, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
