ప్రాజెక్టుల క్లియరెన్స్‌కు ఉత్తమ్ డెడ్‌లైన్..

  • నాలుగు సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులే లక్ష్యం..

హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో కీలకమైన నాలుగు సాగునీటి ప్రాజెక్టులకు పెండింగ్‌లో ఉన్న పర్యావరణ అనుమతులను ఆరు నెలల్లో సాధించేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన పర్యావరణ అనుమతులకు సంబంధించిన తీర్పు ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియకు కొత్త మార్గం చూపిందని పేర్కొంటూ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ సాగర్, దిండి, గౌరవెల్లి ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.

సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఇప్పటికే చెల్లుబాటు అయ్యే పర్యావరణ అనుమతులు ఉన్న ప్రాజెక్టులకు చట్టపరమైన రక్షణ కొనసాగుతుందని, పెండింగ్ దరఖాస్తులను సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు వేగంగా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. గతంలో తిరస్కరించబడిన ప్రతిపాదనలను సాంకేతిక, విధానపరమైన లోపాలను సరిదిద్దిన తర్వాత చట్టబద్ధంగా మళ్లీ సమర్పించాలని సూచించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ బలరాం నాయక్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

ఏడు రోజుల్లో రికార్డుల సమీకరణ

ప్రతి ప్రాజెక్టుకు నోడల్ అధికారులను నియమించి, ఏడు రోజుల్లో అందుబాటులో ఉన్న అన్ని రికార్డులను సమీకరించాలని ఉత్తమ్ ఆదేశించారు. 30 రోజుల్లో పర్యావరణ అధ్యయనాలు, అనుసరణ నివేదికలు, భూ రికార్డులు, చట్టపరమైన పత్రాలను సిద్ధం చేయాలని, 60 రోజుల్లో ప్రధాన పరిపాలనా, దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. సాధ్యమైన మేరకు ఆరు నెలల్లో ప్రాజెక్టుల వారీగా పర్యావరణ అనుమతులు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పర్యావరణ ప్రభావ అధ్యయనాలు, పునరావాస ప్రణాళికలు, అటవీ అనుమతులు, భూసేకరణ పత్రాలు, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన కౌంటర్ అఫిడవిట్ల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు.

గౌరవెల్లి పంప్‌హౌస్ సిద్ధం చేయాలి..

గౌరవెల్లి ప్రాజెక్టుపై సమీక్ష సందర్భంగా పంప్‌హౌస్‌ను పూర్తిస్థాయిలో పనిచేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కాలువల పరిశీలన, మరమ్మతులు, నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగించడం, అవసరమైన వంతెనలు, రహదారుల పనులకు అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రధాన కాలువల ద్వారా త్వరగా నీరు విడుదల చేయడమే తక్షణ లక్ష్యమని చెప్పారు.

సీతారామ సాగర్‌కు వేగం..

సీతారామ సాగర్ ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ అధ్యయనాలు, పత్రాలను వెంటనే సిద్ధం చేయాలని, అనుమతులు వచ్చిన వెంటనే పనులు పునఃప్రారంభించేలా ఇంజినీరింగ్ ప్రణాళికలు సిద్ధంగా ఉంచాలని ఉత్తమ్ ఆదేశించారు. పాలమూరు–రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల విషయంలోనూ ఇదే స్థాయిలో అత్యవసర చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ఎన్జీటీ, సుప్రీంకోర్టు కేసులపై ప్రత్యేక వ్యూహం

సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ పర్యావరణ కేసులన్నింటినీ విడివిడిగా సమీక్షించి, సాంకేతిక నివేదికలు, పర్యావరణ పత్రాలు, కౌంటర్ అఫిడవిట్లు ముందుగానే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది శ్రవణ్ కుమార్ తాజా సుప్రీంకోర్టు తీర్పు ప్రభావాన్ని సమావేశంలో వివరించారు.

పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై అధ్యయనం

పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వల్ల తెలంగాణలో కలిగే ప్రభావంపై కూడా సమావేశంలో చర్చించారు. భూములు, గ్రామాలు, ప్రజా మౌలిక సదుపాయాల ముంపుపై శాస్త్రీయ అధ్యయనం నిర్వహించాలని ఉత్తమ్ ఆదేశించారు. తెలంగాణ వాదనలకు బలమైన సాంకేతిక నివేదికలు, క్షేత్రస్థాయి సమాచారం, ఆర్థిక అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు.

రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి ఖమ్మం జిల్లాపై పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో పనిచేయకముందే స్పష్టంగా కేంద్రం ముందు ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. భూములు, మౌలిక సదుపాయాలకు జరిగే నష్టానికి తగిన పరిహారం అందేలా కేంద్ర ప్రభుత్వంతో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముందు తెలంగాణ వాదనలను బలంగా వినిపించాలని అధికారులకు సూచించారు.