మనసును హత్తుకున్న మెలోడీ
తండ్రీ–కూతుళ్ల బంధానికి అద్దం
రవితేజ సినిమా నుంచి కొత్త పాట
‘ఇరుముడి’ రెండో లిరికల్ సాంగ్ విడుదల
ఆగస్టు 21న ‘ఇరుముడి’ విడుదల
హైదరాబాద్, ఆంధ్రప్రభ: మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవాని శంకర్ జంటగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ‘ఇరుముడి’ చిత్రం నుంచి రెండో లిరికల్ సాంగ్ ‘యాలాలో యాలాలో’ను చిత్రబృందం విడుదల చేసింది. విడుదలైన కొద్ది సేపటికే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది.
“యాలాలో యాలాలో.. వెన్నెల్లో ఎన్నెన్ని ముచ్చట్లో..” అంటూ సాగే ఈ మెలోడీ గీతం కుటుంబ అనుబంధాలు, ముఖ్యంగా తండ్రీ–కూతుళ్ల మధ్య ఉన్న భావోద్వేగ బంధాన్ని హృద్యంగా ఆవిష్కరిస్తోంది. మధురమైన బాణీ, హృదయాన్ని హత్తుకునే సాహిత్యం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ పాటకు ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. భావోద్వేగాలకు అద్దం పట్టేలా రూపొందిన ఈ గీతం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ, ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భావోద్వేగాలు, కుటుంబ విలువలు, వినోదం మేళవింపుగా రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
