న్యాయం చేయాలని ఇంటి ముందు బైఠాయించిన మహిళ

తొర్రూరు, ఆంధ్రప్రభ : మండలంలోని నాంచారి మడూరు గ్రామంలో తనను ఇంట్లోకి అనుమతించడం లేదని గ్రామానికి చెందిన ఎండి రేష్మా బేగం ఇంటి ముందు బైఠాయించి న్యాయం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలను వేడుకున్నారు. ఈ సందర్భంగా రేష్మా బేగం మాట్లాడుతూ అదే గ్రామానికి చెందిన ఎండి నబికి మొదటి భార్య ఎండి షమీంకు సంతానం లేకపోవడంతో ఆమె అంగీకారంతో 2011లో పెద్దల సమక్షంలో ముస్లిం సంప్రదాయం ప్రకారం తన వివాహం నబితో జరిగినట్లు తెలిపారు. అనంతరం కొన్నేళ్ల పాటు తాము ముగ్గురూ ఒకే ఇంట్లో కలిసి జీవించామని చెప్పారు.

అయితే, అదనపు కట్నం తీసుకురావాలని భర్త నబి తనను వేధించడంతో తల్లిగారింటికి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో భర్తకు క్యాన్సర్ సోకి మరణించిన విషయాన్ని తనకు తెలియజేయకుండా దహన సంస్కారాలు నిర్వహించారని ఆరోపించారు. తనకు ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతోనే భర్త మరణ విషయాన్ని సైతం గోప్యంగా ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు చెందిన ఆస్తిని మొదటి భార్య అమ్మివేసిందని, ప్రస్తుతం మిగిలిన ఆస్తిని కూడా విక్రయించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తన భర్త సంపాదించిన ఇంటిలో నివసించే హక్కు కల్పించి, తనకు న్యాయం చేయాలని అధికారులను, గ్రామ ప్రజాప్రతినిధులను, గ్రామ పెద్దలను రేష్మా బేగం వేడుకున్నారు.