నిమ్స్ అరుదైన ఘనత..

  • ఆధునిక వైద్యంలో మరో మైలురాయి..

హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆధునిక వైద్య రంగంలో మరో అరుదైన ఘనతను సాధించింది. కేవలం మూడేళ్లలోపే 1,000 రోబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వ వైద్య సంస్థగా కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ శస్త్రచికిత్సల్లో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) వంటి ప్రభుత్వ పథకాల కింద రోగులకు ఉచితంగా నిర్వహించడం విశేషం.

రోబోటిక్ శస్త్రచికిత్సల ద్వారా చిన్న కోతలతోనే అత్యంత ఖచ్చితత్వంతో క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహించవచ్చని నిమ్స్ తెలిపింది. దీంతో శస్త్రచికిత్స అనంతరం నొప్పి, రక్తస్రావం తగ్గడమే కాకుండా ఆస్పత్రిలో ఉండే రోజుల సంఖ్య తగ్గి రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు.

యూరాలజీ విభాగంలో అత్యధిక శస్త్రచికిత్సలు

మొత్తం 1,000 రోబోటిక్ శస్త్రచికిత్సల్లో యూరాలజీ విభాగం అత్యధికంగా 590 ఆపరేషన్లు నిర్వహించింది. వీటిలో ప్రోస్టేట్ క్యాన్సర్‌కు రాడికల్ ప్రోస్టేటెక్టమీ, మూత్రాశయ క్యాన్సర్‌కు రాడికల్ సిస్టెక్టమీ, రోబోటిక్ మూత్రపిండ మార్పిడి, యూరో-గైనకాలజీ, పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు ఉన్నాయి.

గ్యాస్ట్రో, క్యాన్సర్ విభాగాల సేవలు

సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం 248 రోబోటిక్ శస్త్రచికిత్సలు నిర్వహించింది. వీటిలో కాలేయం, పిత్తాశయం, ప్యాంక్రియాస్, పెద్దపేగు, చిన్నపేగు, జీర్ణాశయానికి సంబంధించిన క్లిష్టమైన ఆపరేషన్లు ఉన్నాయి. అలాగే సర్జికల్ ఆంకాలజీ విభాగం 162 శస్త్రచికిత్సలు చేపట్టింది. అండాశయ, గర్భాశయ, పెద్దపేగు తదితర క్యాన్సర్‌లకు సంబంధించిన శస్త్రచికిత్సలతో పాటు అవయవాలను కాపాడే, నరాలను సంరక్షించే ఆధునిక విధానాలను కూడా అమలు చేసింది.

వైద్య బృందానికి డైరెక్టర్ అభినందనలు

నిమ్స్ డైరెక్టర్, సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ ఈ ఘనత సాధించిన యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ విభాగాల వైద్యులు, నర్సులు, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది, ఇతర సహాయక విభాగాలను అభినందించారు. అత్యాధునిక వైద్య సేవలను బలోపేతం చేయడంలో సహకరించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.