మూడేళ్లలో 1,000 రోబోటిక్ శస్త్రచికిత్సలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అత్యాధునిక వైద్య సేవల్లో మరో కీలక మైలురాయిని చేరుకుంది. రోబోటిక్ సర్జరీ సేవలు ప్రారంభించిన మూడేళ్లలోపే 1,000 రోబోటిక్ సహాయక శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
ఈ శస్త్రచికిత్సల్లో యూరాలజీ విభాగం 590, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం 248, సర్జికల్ ఆంకాలజీ విభాగం 162 శస్త్రచికిత్సలు నిర్వహించింది. కిడ్నీ మార్పిడి, క్యాన్సర్ చికిత్సలు, క్లిష్ట పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు వంటి సంక్లిష్ట వైద్య ప్రక్రియలను కూడా రోబోటిక్ సాంకేతికతతో విజయవంతంగా నిర్వహించడం విశేషం. అత్యంత ఖరీదైన ఈ రోబోటిక్ శస్త్రచికిత్సల్లో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) వంటి ప్రభుత్వ పథకాల ద్వారా రోగులకు పూర్తిగా ఉచితంగా అందించడం మరో విశేషంగా నిలిచింది.
ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ డా. రాహుల్ దేవరాజ్ వైద్యులు, శస్త్రచికిత్స బృందాలను అభినందించారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించిన మార్గదర్శకం, ప్రభుత్వ సహకారంతోనే ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు. రోబోటిక్ సర్జరీల విస్తరణతో నిమ్స్ దేశంలోని ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఒకటిగా మరింత గుర్తింపు పొందుతోందని అధికారులు తెలిపారు.
