ఆగస్టు 6 నుంచి సీపీఐ పాదయాత్రలు

  • ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై నిర‌స‌న
  • సెప్టెంబ‌ర్ ఒక‌టో తేదీ చ‌లో ఢిల్లీ కార్య‌క్ర‌మం

చిల‌క‌లూరిపేట‌, ఆంధ్రప్రభ : కేంద్రంలోని ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న‌ను నిర‌సిస్తూ సెప్టెంబ‌ర్ ఒక‌టో తేదీ చ‌లో ఢిల్లీ కార్య‌క్ర‌మంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ ఆగ‌స్టు 6 నుంచి 15వ తేదీ వ‌ర‌కు మార్పు కోసం అనే నినాదంతో పాద‌యాత్ర‌లు నిర్వ‌హిస్తున్న‌ద‌ని, ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌జ‌లు విజ‌య‌వంతం చేయాల‌ని సీపీఐ జిల్లా కార్య‌వ‌ర్గ స‌భ్యులు షేక్ సుభాని కోరారు. ప‌ట్ట‌ణంలోని సీపీఐ కార్యాల‌యంలో సోమ‌వారం చ‌లో ఢిల్లీ పోస్ట‌ర్ల‌ను పార్టీ నాయ‌కులతో క‌ల‌సి ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ .. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్లైనా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని దుయ్యబట్టారు. సీబీఐ, ఈడీ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుటోందని మండిపడ్డారు. మద్దతు ధర విషయంలో రైతులపై కనికరం చూపకుండా, గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించకుండా వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టి రైతులను కట్టు బానిసలుగా మార్చాలని చూస్తున్నారన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్ముతున్నారని పేర్కొన్నారు. వరుస పేపర్‌ లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య రామ మందిరంలో రూ.200 కోట్ల దోపిడీ జరిగినా ఎందుకు పట్టుకోలేదని నిలదీశారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం పూర్తి, రాజధాని నిర్మాణం, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం వంటివి ఇంతవరకు సాధించలేకపోయిన అసమర్థ సీఎం అని దుమ్మెత్తిపోశారు.

2014లో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన హామీలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనలో ప్రజల సమస్యలను విస్మరించి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చిందని ఆయన విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పాదయాత్రలు, సభలు, కరపత్రాల పంపిణీ ద్వారా విస్తృత ప్రచారం చేపడతామని చెప్పారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామలీలా మైదానంలో జరిగే బహిరంగ సభకు దేశవ్యాప్తంగా 10 లక్షల మందిని సమీకరించనున్నట్లు తెలిపారు.

పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, విద్యా–వైద్య రంగాల నిర్లక్ష్యం, కార్మికులకు కనీస వేతనాల లేమి, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, మైనార్టీలపై దాడులు పెరగడం, మహిళల భద్రత లోపించడం వంటి అంశాలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు. పాదయాత్రల ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం ప్రజలను సంఘటితం చేస్తామని, ప్ర‌జ‌లు , రైతులు, కార్మికులు, యువత, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

కార్య‌క్ర‌మంలో సీపీఐ ప‌ట్ట‌ణ కార్య‌ద‌ర్శి చెరుకుప‌ల్లి నిర్మ‌ల‌, ఏఐటీయూసీ ఏరియా కార్య‌ద‌ర్శి దాస‌రి వ‌ర‌హాలు, వేలూరు గ్రామ కార్య‌ద‌ర్శి ఏలికా శ్రీ‌నివాస‌రావు, మాజీ స‌ర్పంచ్ బంతా తిర‌ప‌త‌య్య‌, నాయ‌కులు నాస‌ర‌య్య‌, చౌటుప‌ల్లి నాగేశ్వ‌ర‌రావు, దానియేలు, కొండ్ర‌గుంట్ల వెంక‌ట్రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.