Sangareddy బ్యాడ్మింటన్ రాకెట్ పట్టిన చైర్‌పర్సన్
Sangareddy బ్యాడ్మింటన్ రాకెట్ పట్టిన చైర్‌పర్సన్
- ఉద్యోగుల్లో ఉత్సాహం నింపిన నిర్మల జగ్గారెడ్డి
సంగారెడ్డి (Sangareddy), ఆంధ్రప్రభ: తెలంగాణ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక స్పోర్ట్స్ మీట్ రెండో రోజు గురువారం ఉత్సాహభరితంగా సాగింది. హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన ఇండోర్ క్రీడా పోటీల్లో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఉద్యోగులతో కలిసి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
బ్యాడ్మింటన్, క్యారమ్స్ పోటీల్లో స్వయంగా పాల్గొని తన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో పాటు ఉద్యోగుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించారు. ఆమెతో కలిసి అధికారులు, సిబ్బంది కూడా వివిధ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ స్పోర్ట్స్ మీట్‌లో విజేతలకు శుక్రవారం గచ్చిబౌలిలోని ఐఎస్‌బీలో బహుమతులు ప్రదానం చేయనున్నారు. బహుమతి ప్రదానోత్సవంతో పాటు టీజీఐఐసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.
ఉద్యోగుల మధ్య ఐక్యత, స్నేహభావం, జట్టుగా పనిచేసే స్ఫూర్తిని పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని నిర్మల జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ ఉన్నతాధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
