Revanth Reddy | దేశ అభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాది

Revanth Reddy | దేశ అభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాది

  • వికసిత్ భారత్‌కు విద్య, వైద్యమే బలం
  • కులగణన తర్వాత తెలంగాణ మోడల్‌ను నీతి ఆయోగ్‌కు వివరించిన రేవంత్
  • విద్యే సామాజిక మార్పుకు అసలైన ఆయుధం
  • ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్
  • స్టార్టప్‌ల అభివృద్ధికి తెలంగాణ హ‌బ్‌..
  • యంగ్ ఇండియా స్కూల్స్‌తో విద్యా విప్లవం
  • హైదరాబాద్‌కు ఐఐఎం కావాలి.. కేంద్రానికి సీఎం విజ్ఞప్తి
  • ఎం-6 టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలి
  • నీతి అయోగ్ మీటింగ్‌లో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ – ఆంధ్ర‌ప్ర‌భ ప్ర‌తినిధి : దేశ అభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాది అని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యా విప్లవం, నైపుణ్యాభివృద్ధి, ప్రపంచ స్థాయి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి అవ‌స‌ర‌మ‌ని సీఎం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్-2047 లక్ష్యాన్ని సాధించాలన్నా, దేశంలోని ప్రతి విద్యార్థికి, పౌరుడికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలన్నారు.

గురువారం రాష్ట్రపతి భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ స‌మావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజ‌రై ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి కులగ‌ణ‌న త‌ర్వాత తెలంగాణ అభివృద్ధి నమూనాను వివ‌రించారు. ప్రజలను ఆర్థిక శక్తులుగా, దేశ నిర్మాతలుగా తీర్చిదిద్దడంలో విద్య, ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తాయని సీఎం చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం 2024లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3.55 కోట్ల మంది, 242 కులాలకు చెందిన ప్రజల వివరాలను సేకరించిన ఈ సర్వేలో పైస‌లు, భూమి కంటే విద్యే సామాజిక వెనుకబాటుతనాన్ని ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన అంశంగా తేలింద‌ని చెప్పారు.

అందుకే ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య అందించడం ద్వారా మాత్రమే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించవచ్చని స్పష్టం చేశారు.

తెలంగాణలో విద్యా-నైపుణ్యాభివృద్ధి విప్లవం

విద్యాశాఖను త‌న వద్దే ఉంచుకోవడానికి కారణం విద్యపై తన‌కు ఉన్న నమ్మకమేనని సీఎం రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టిందన్నారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్‌లో చదివే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు.

తమ ప్ర‌భుత్వం నిర్మించే యంగ్ ఇండియా స్కూల్స్ కులాల మధ్య గోడలు కూల్చివేస్తాయ‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి అయినా… అధికారులైనా తమ రాష్ట్రంలోని యంగ్ ఇండియా స్కూల్స్ చూస్తామంటే తాము సంతోషంగా చూపిస్తామని చెప్పారు.

యువతకు కొత్త నైపుణ్యాలు అవసరం..

కృత్రిమ మేధస్సు (ఏఐ) యుగంలో యువతకు కొత్త నైపుణ్యాలు అవసరమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తయారీ రంగం, సేవారంగాల్లో భారీ ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు రీజినల్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రైల్వే, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

యువతకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆనంద్ మహీంద్రా, శ్రీనిరాజు వంటి కార్పొరేట్ దిగ్గజాలు ఈ వర్సిటీ నిర్వహణలో భాగస్వాములుగా ఉన్నారని వివరించారు. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను ఆధునిక సాంకేతిక శిక్షణ కేంద్రాలుగా మార్చేందుకు టాటా గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని సీఎం తెలిపారు.

ఈ ప్రాజెక్టులో టాటా సంస్థ రూ.2,100 కోట్ల పెట్టుబడి పెడుతుంద‌న్నారు.

స్టార్టప్‌ల అభివృద్ధికి తెలంగాణ హ‌బ్‌..

తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్పారు. ఉన్నత విద్య, పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్‌ల అభివృద్ధికి తెలంగాణ కేంద్రంగా మారుతోందన్నారు.

ఇప్పటికే ఐఐటీ, ఐఐఐటీ, నల్సార్, ఐఎస్‌బీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఉన్నాయని, హైదరాబాద్‌కు ఐఐఎం రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ వ‌ర్సిటీలు తెలంగాణకు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని, ఈ దిశగా యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్ ఏర్పాటు చేయడం తొలి విజయమని వివ‌రించారు.

ఎం-6 టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలి..

దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజిన్లుగా ఉన్న ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో ఎం-6 టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారు. ఈ నగరాల అభివృద్ధి కోసం రూ.6 లక్షల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలని కోరారు.

ఒక్కో నగరానికి రూ.1 లక్ష కోటి చొప్పున మౌలిక వసతుల అభివృద్ధికి అందించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతూ సీఎం పలు ప్రతిపాదనలు చేశారు. రీజినల్ రింగ్ రోడ్, హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ, మూసీ నది పునరుజ్జీవనం, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులు, సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు మద్దతు, హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు వంటి అంశాల్లో సహకారం అందించాలని కోరారు.

దేశ ప్రజల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి పెడితే ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా భారత్ అవతరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Monsoon Health Tips I 10 ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే ముప్పే!