పేదలకు సీఎం సహాయనిధి వరం
- ఆపదలో నిరుపేద కుటుంబాలకు కొండంత అండ
- చెక్కుల పంపిణీలో నీలం మధు ముదిరాజ్
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఆపద సమయంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి సంజీవనిలా మారిందని, నిరుపేద కుటుంబాల ఆరోగ్య భద్రతకు ఈ పథకం గొప్ప భరోసాగా నిలుస్తోందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. బుధవారం ఎన్‌ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అమీన్‌పూర్ డివిజన్‌కు చెందిన అనసూయకు రూ.60 వేలు, గుమ్మడిదల మండలానికి చెందిన సీహెచ్ శ్రీనివాస్‌కు రూ.47,500, ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్‌కు చెందిన సంగన్నగారి మహేష్‌కు రూ.60 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ.. ఖరీదైన వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేని పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత అండగా నిలుస్తోందన్నారు. సకాలంలో చికిత్స అందక, వైద్య ఖర్చుల కోసం అప్పుల పాలవుతున్న అనేక కుటుంబాలను ప్రభుత్వం ఈ నిధి ద్వారా ఆదుకుంటోందని పేర్కొన్నారు.
అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు నిరాశ చెందకుండా అర్హులైన వారు ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న బాధితుల వినతులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన నిధులు మంజూరయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు నీలం మధు ముదిరాజ్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
