డెలివరీకెళ్తే పుట్టిన బిడ్డను విక్రయించిన నర్స్
డెలివరీకెళ్తే పుట్టిన బిడ్డను విక్రయించిన నర్స్
రూ.1.50 లక్షకు ఆడ శిశువు అమ్మకం
మెదక్ కేర్ ఆసుపత్రిలో నిర్లక్ష్యం
నలుగురి అరెస్ట్.. రిమాండ్
మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: పురిటినొప్పులతో బాధపడుతూ ఓ గర్భిణీ ప్రసవం కోసం ఆసుపత్రికెళ్తే .. పుట్టిన బిడ్డను అక్కడ పని చేసే నర్స్ రూ. 1.50 లక్షలకు విక్రయించిన సంఘటన మెదక్ జిల్లాలో మంగళవారం వెలుగు చూసింది. మెదక్ పట్టణ సీఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ కు చెందిన నస్రా ఫాతిమా అనే గర్భిణీ గత నెల 12న పురిటి నొప్పులతో మెదక్ జిల్లా కేంద్రంలోని కేర్ ఆసుపత్రిలో అడ్మిట్ కావడం జరిగిందన్నారు. ఆమెకు బ్లడ్ తక్కువగా ఉన్నందున అదే రోజు రాత్రి బ్లడ్ ఎక్కించడం జరిగిందన్నారు.
మరుసటి రోజు 13న ఉదయం 12.00 గంటల సమయంలో వైద్యులు సర్జరీ చేసి ప్రసవం చేయగా 2.4 కేజీ ల బరువు ఉన్న ఆడ శిశువు జన్మించినట్లు తెలిపారు. ఇదే క్రమంలో అక్కడ నర్స్ గా పనిచేసే అక్తరి బేగం ముందస్తు పథకం ప్రకారం పుట్టిన శిశువును చిన్న పిల్లల వైద్యుడు వద్దకు తీసుకెళ్తున్నట్లు చెప్పి స్థానిక గోల్కొండ వీధికి చెందిన నౌసిన్ ఉన్నిసా (నిలోఫర్) అనే వ్యక్తి సహకారంతో సిద్దిపేటకు చెందిన మహమ్మద్ ఇక్బాల్ ఉద్దీన్, శదీయ సుల్తానా దంపతులకు రూ.1,50,000లకు అమ్మినట్లు తెలిపారు.
అలా వచ్చిన డబ్బులో నుంచి రూ.1,40,000లను నర్స్ అకరి బేగుం తీసుకొని, మిగతా రూ.10,000లను నౌసిన్ ఉన్నిసా (నిలోఫర్) కు ఇచ్చినట్లు వివరించారు. కాగా బిడ్డ చనిపోయిందని తల్లిదండ్రులకు నర్స్ చెప్పినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత అసలు విషయం బయటకు రావడంతో బాధితులు ఈనెల 3న పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనలో హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపి కేర్ ఆసుపత్రిలో నర్స్ అక్తరి బేగం, మధ్యవర్తి నౌసిన్ ఉన్నిసా (నిలోఫర్), శిశువును కొనుగోలుచేసిన సిద్దిపేటకు చెందిన మహమ్మద్ ఇక్బాల్ ఉద్దీన్, శదీయ సుల్తానాలను అరెస్ట్ చేసు రిమాండ్ కు తరలించటం జరిగిందని సీఐ మహేష్ పేర్కొన్నారు.
