అర్హులందరికీ అక్రిడిటేషన్ కార్డులివ్వాలి

అర్హులందరికీ అక్రిడిటేషన్ కార్డులివ్వాలి

  • టీయూడబ్ల్యూజే(ఐజేయూ)
  • ఇవ్వకుంటే పోరాటం తప్పదని హెచ్చరిక
  • జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు అందించాలి
  • నెలాఖరులో జిల్లా మహాసభ నిర్వహణకు నిర్ణయం

సంగారెడ్డి ప్ర‌తినిధి, (ఆంధ్రప్రభ): సంగారెడ్డి జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ తక్షణమే అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే-ఐజేయూ) జిల్లా శాఖ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అక్రిడిటేషన్ కార్డుల జారీలో మరింత జాప్యం జరిగితే ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించింది. బుధవారం సంగారెడ్డిలో జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ అత్యవసర సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏకే ఫైజల్ అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు సిద్ధన్న పాటిల్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా విభాగం అధ్యక్షుడు అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇంటి స్థలాల సమస్య, హెల్త్ కార్డుల అంశంపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం కేటాయించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న విధంగానే జర్నలిస్టులకు కూడా హెల్త్ కార్డులు అందించాలని డిమాండ్ చేశారు.

అక్రిడిటేషన్ జారీలో తీవ్ర జాప్యం

జీవో నంబర్ 252 ప్రకారం అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందని పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏకే ఫైజల్ అహ్మద్ ఆధ్వర్యంలో మీడియా అకాడమీ చైర్మన్‌ను పలుమార్లు కలిసి సమస్యను వివరించడంతో కొన్ని సవరణలు జరిగాయని అన్నారు. దాని ఫలితంగా అనేక మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు లభించాయని తెలిపారు. మిగిలిన అర్హులకు కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా వెంటనే కార్డులు జారీ చేయాలని కోరారు.

జర్నలిస్టు సమస్యలపై నిరంతర‌ పోరాటం

జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సంఘంగా టీయూడబ్ల్యూజే(ఐజేయు) కొనసాగుతోందని జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి అన్నారు. ప్రభుత్వంలో ఎవరు ఉన్నప్పటికీ జర్నలిస్టుల సంక్షేమమే తమ సంఘం ప్రధాన లక్ష్యమని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ నెలాఖరులో జిల్లా మహాసభను నిర్వహించి కొత్త జిల్లా కమిటీని ఎన్నుకుంటామని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏకే ఫైజల్ అహ్మద్ తెలిపారు. యూనియన్ కార్యక్రమాల్లో సభ్యులందరూ చురుకుగా పాల్గొని సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అక్రమ్ పటేల్, మసూద్ ఖాన్, శ్రీనాథ్, బాసిత్, అన్వర్ హుస్సేన్, హాజీ, మినాజ్, సిద్ధిక్, విష్ణువర్ధన్, జోగిపేట భూమన్న, యాదగిరి, అబ్దుల్ మతీన్, విల్సన్, అంజయ్య, సంగమేశ్, వెంకటేష్ గౌడ్, సిద్ధు, రమేష్ గౌడ్, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.