ఆందోల్ మైసమ్మ ఆలయంలో 21వ బోనాల ఉత్సవాలు

భక్తిశ్రద్ధలతో సర్కార్ బోనం..

వేలాదిగా తరలివచ్చిన భక్తులు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థానంలో 21వ బోనాల ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహించారు.

ఉత్సవాల్లో భాగంగా చండీ హోమం, ఆందోల్ మైసమ్మ తల్లి, ఉప్పలమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లుల ఉత్సవ విగ్రహాల గ్రామసేవ, రథోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల అశ్విన్ రెడ్డి, కార్యనిర్వాహణాధికారి (ఈఓ) సల్వాది మోహన్ బాబు, భువనగిరి నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన ఈఓ అలుగుబెల్లి సత్తిరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు సంప్రదాయబద్ధంగా అమ్మవారికి ‘సర్కార్ బోనం’ను నైవేద్యంగా సమర్పించారు.

హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం సమర్పించి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు.

దర్శనానంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రముఖ దాతలు కొమిరిశెట్టి విజయ్ కుమార్ – శిరీష దంపతులు సహకారం అందించారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చౌటుప్పల్ డీఎస్పీ పటోళ్ల మధుసూదన్ రెడ్డి పర్యవేక్షణలో, ట్రాఫిక్ సీఐ నందగిరి వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. క్యూలైన్ల ద్వారా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శీఘ్ర దర్శనం కల్పించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గిర్కటి నిరంజన్ గౌడ్, మాజీ సర్పంచ్ పబ్బు రాజు గౌడ్, చౌటుప్పల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, ఈఓ అలుగుబెల్లి సత్తిరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు ఈడుదుల బాబు, బేతాళ నరసింహ, సిద్ధిపేట ఆనందరెడ్డి, వెంకిర్యాల శివ, బాలగోని శ్రీకాంత్ గౌడ్, బొంతల యువరాజ్, మన్నే మహేందర్ రెడ్డి, దౌడీ రాజేష్, పన్నాల మహేందర్ రెడ్డి, ధేప రాజీవ్, పంతంగి రమేష్, జొన్నగంటి దాసు, చిట్టెంపల్లి సబిత, అర్చకులు వల్లూరి శివప్రసాద్ శర్మ, గ్రామ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.