సరైన పత్రాలు లేని 12 బైక్‌లు స్వాధీనం

  • గడివేములలో ప్రత్యేక తనిఖీలు..
  • వాహనాల ధ్రువపత్రాలపై పోలీసులు ఆరా

నంద్యాల, ఆంధ్రప్రభ: నంద్యాల జిల్లా గడివేముల మండలంలోని పెసరవాయి గ్రామంలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 12 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

గడివేముల పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఆదివారం తెల్లవారుజామున కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులను తనిఖీ చేశారు.

తనిఖీల్లో సరైన రిజిస్ట్రేషన్, యాజమాన్యానికి సంబంధించిన ధ్రువపత్రాలు చూపించలేని 12 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాల యాజమాన్యానికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

ప్రజలు వాహనాలను నడిపే సమయంలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్, బీమా, డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు ఇతర అవసరమైన పత్రాలను వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. అలాగే చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ఇలాంటి తనిఖీలు తరచూ నిర్వహిస్తామని వెల్లడించారు.