భారీ ఊరట

త‌గ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధ‌ర‌
19 కేజీల కమర్షియల్ ఎల్పీజీపై రూ.192 తగ్గింపు..
గృహ వినియోగ సిలిండర్ ధరల్లో మార్పు లేదు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు 19 కేజీల వాణిజ్య (కమర్షియల్) ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.192 మేర తగ్గించాయి. కొత్త ధరలు ఆగస్టు 1, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే సాధారణ వినియోగదారులు ఉపయోగించే 14.2 కేజీల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.

ధరల తగ్గింపుతో ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,930 నుంచి రూ.2,738కు తగ్గింది. హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,985గా కొనసాగుతోంది. అలాగే 5 కేజీల ఓపెన్ మార్కెట్ ఎల్పీజీ సిలిండర్ ధరను కూడా రూ.46.50 మేర తగ్గించి రూ.762గా నిర్ణయించారు. ఈ ధరల తగ్గింపు ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు, టీ దుకాణాలు, చిన్న వ్యాపార సంస్థలకు కొంత ఉపశమనం కలిగించనుంది. అయితే గృహ వినియోగదారులు ఉపయోగించే 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో, సామాన్య కుటుంబాలకు ఈసారి ధరల తగ్గింపు ప్రయోజనం అందలేదు.