బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర పండుగ హోదా : కేటీఆర్
ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
యాదాద్రి పునర్నిర్మాణానికి రూ.1,800 కోట్లు..
దేవాలయాలకు విస్తృతంగా నిధుల కేటాయించాం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బోనాల పండుగకు రాష్ట్ర పండుగ హోదా కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లష్కర్ బోనాల సందర్భంగా ఆదివారం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగను అధికారిక రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రతి ఏడాది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించామని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వ బడ్జెట్ నుంచి సుమారు రూ.1,800 కోట్లు వెచ్చించి దేశంలోనే అత్యంత వైభవంగా తీర్చిదిద్దామని తెలిపారు. అలాగే తమ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు దేవాలయాలకు అవసరమైన నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేశామని గుర్తుచేశారు. తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని కేటీఆర్ పేర్కొన్నారు.
