Godavari-Flood-Alert : గోదావర్రీ .Andhra Prabha Top Story .

Godavari-Flood-Alert : గోదావర్రీ .Andhra Prabha Top Story .

  • న‌దీ తీరంలో అల‌జ‌డి …
  • రాకపోకలు బంద్.
  • ఏటిగట్టు పొడవున పహారా..
  • అధికారులు హై అలర్ట్

(నర్సాపురం ,ఆంధ్ర ప్రభ).

వశిష్ఠ నది ఉగ్ర రూపం దాల్చి గోదా “వర్రీ ” గా మారింది. వరద నీటి తాకిడితో గోదావరి నీరు ఎరుపెక్కింది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో ఉదృతంగా ప్రవహిస్తుంది. ఉరకలు వేస్తూ సముద్రంవైపు పరుగులు పెడుతోంది. సుడులు తిరుగుతూ వడి వడిగా సాగుతున్న గోదావరి నదిపై రాకపోకలను అధికారులు నిలిపేశారు. మత్స్య కారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి నీరు గట్టు బరాబరికి చేరుతుంది. వలందర రేవు, శివాలయం రేవు, కొండలమ్మ గుడి రేవు లను వరద నీరు ముంచెత్తింది. ఏటిగట్టు పొడవున బలహీన ప్రాంతాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్న మయ్యారు. గట్టు లీకులు ఉంటే అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టేందుకు సర్వం సిద్ధం చేశారు. కంజరవెన్సి శాఖ ఇసుక బస్తాలు, కొండ రాళ్ళు సిద్ధంగా ఉంచారు. ఎటువంటి ప్రమాదం ను అయినా ఎదుర్కునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. గత అనుభవాలను దృష్టి లో ఉంచుకొని భద్రత చర్యలు చేపడుతున్నారు.

గజ ఈతగాళ్లు, రిస్క్యూ టీమ్ లను కూడా సిద్ధం చేశారు. పట్టణ పరిధిలోని పొన్నపల్లి, రాజుల్లంక తదితర ప్రాంతాల్లో గట్టు బలహీన పడకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు.
గోదావరి గట్టు పై అధికారులు పహారా కాస్తున్నారు. ముఖ్య ప్రదేశాల్లో రెవెన్యూ, పోలీసులు పికెటింగ్ చేస్తున్నారు. పట్టణ పరిధిలోని మాధవాయపాలెం ఫెర్రీ రేవు వద్ద రాకపోకలను శుక్రవారం రాత్రి నుంచి నిలిపేశారు. హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి ప్రయాణీకులను అప్రమత్తం చేస్తున్నారు. మత్స్య కారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. నదీ తీరం వెంబడి ఉన్న నివాస ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి ఉధృతిని గురించి ప్రజలకు తెలియజేస్తూ ఎప్పటి కప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ రెండు రోజులు కీలకం అని, అధికారులు , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా ఎస్పీ నయీం అస్మి ఆదేశాలతో నర్సాపురం డీఎస్పీ సుధాకర్ రావు ఆద్వర్యం లో సి ఐ, ఎస్ ఐ లు, పోలీస్ సిబ్బంది మరియు జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాలు తో నర్సాపురం ఆర్ డి ఓ దాసి రాజు ఆద్వర్యం లో తహసీల్దార్ నాగార్జున, వి ఆర్ ఓ లు, రెవెన్యూ సిబ్బంది వరద విధులలో నిమగ్నమై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Godavari-Flood-Alert : సర్వం సిద్ధం : తహసీల్దార్ నాగార్జున.

భద్రాచలం వద్ద గోదావరి నీరు మొదటి హచ్చరిక కు వచ్చినందున నర్సాపురం లో గోదావరి నదికి వరద నీరు తగ్గుతుందని నర్సాపురం తహసిల్దార్ నాగార్జున తెలిపారు. గోదావరి నది పొడవున గల స్లూయిజ్ లను పరిశీలించామని, రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. పోన్నపల్లి ప్రాంతంలో గట్టు లీకు లేదని అయినప్పటికీ అత్యవసర సేవలకు గాను మున్సిపల్ శాఖ ఇంజన్లు సిద్ధం చేసిందన్నారు. ఎటువంటి విపత్తు వచ్చిన ఎదుర్కునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నరసాపురం మండలంలోని వరద ముంపు ఉన్న గోదావరి తీర ప్రాంతాలను ఆదివారం అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడిన తహసీల్దార్, సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. వాతావరణ శాఖ సూచనలు, ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రాణ భద్రతే ముఖ్యమని, అధికారులు ఇచ్చే సూచనలను నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు.
అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధంగా ఉందని తహసీల్దార్ ఈ. నాగార్జున తెలిపారు.