రేషన్ మాఫియాపై ఉక్కుపాదం..
- ప్రతి దుకాణంలో సీసీ కెమెరాలు
- నెల రోజుల్లో అన్ని రేషన్ దుకాణాల్లో నిఘా వ్యవస్థ..
- అక్రమాలకు పాల్పడితే కేసులు తప్పవని హెచ్చరిక
- గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి
గుంటూరు, ఆంధ్రప్రభ: జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల్లో వచ్చే నెల రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, సరఫరా ప్రక్రియను పూర్తిగా నిఘాలోకి తీసుకువస్తామని వెల్లడించారు.
రేషన్ సరఫరా నిర్వహిస్తున్న అనిల్‌కు సంబంధించిన రేషన్ దుకాణాలపై ప్రత్యేక దృష్టి సారించి, అక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలు తక్కువ ధరలకు నాణ్యమైన సన్న బియ్యం, స్టీమ్ బియ్యం కొనుగోలు చేసేందుకు రైతు బజార్లు, రైస్ మిల్లుల అవుట్లెట్లలో ప్రత్యేకంగా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ప్రభుత్వం పేదలకు సన్న బియ్యాన్ని రూ.50కే, స్టీమ్ బియ్యాన్ని రూ.60కే అందిస్తున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ అధికారిణి కోమలి పద్మ మాట్లాడుతూ.. రేషన్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేయడంలో ఎలాంటి వెనుకంజ ఉండదని స్పష్టం చేశారు. అలాగే జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పారదర్శకంగా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
