పార్టీకి, ప్రజలకు అండగా నరెడ్ల వీరారెడ్డి..

  • వైసీపీ సిద్ధాంతాల ప్రచారంలో అంకితభావం సేవలు
  • సమర్థవంతంగా రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ బాధ్యతలు
  • ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర
  • ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన సేవాతత్పరూడిగా పేరు

ఏ.కొండూరు, ఆంధ్రప్రభ : “పదవుల కోసం కాదు.. ప్రజాసేవ కోసమే రాజకీయాలు” అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా రాష్ట్ర వైసీపీ గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నరెడ్ల వీరారెడ్డి గుర్తింపు పొందుతున్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పార్టీకి, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తున్నారు.

ప్రజాసేవే పరమావధి

ఏ.కొండూరు మండలం అట్లప్రగడ గ్రామానికి చెందిన నరెడ్ల వీరారెడ్డి ప్రజాసేవనే పరమావధిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితాన్ని ఆరంభించిన ఆయన, పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించి నాయకత్వం ప్రశంసలు అందుకున్నారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణానంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని విశ్వసించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ ఆవిర్భావం నుంచి గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ విస్తరణ, బలోపేతం కోసం అంకితభావంతో పనిచేస్తూ కార్యకర్తలకు నిరంతరం అండగా నిలుస్తున్నారు.

ఆయన సేవలను గుర్తించిన పార్టీ నాయకత్వం జిల్లా స్థాయిలో పలు బాధ్యతలు అప్పగించగా, ప్రస్తుతం రాష్ట్ర వైసీపీ గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చే వినతులు, ఫిర్యాదులను పార్టీ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వాటి పరిష్కారానికి కృషి చేస్తూ పార్టీకి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్నారు.

పేదలు, రైతులు, యువత, మహిళల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ అందుబాటులో ఉండే నాయకుడిగా నరెడ్ల వీరారెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ, పార్టీ కార్యకర్తలను ప్రోత్సహిస్తూ సేవాభావంతో ముందుకు సాగుతున్నారు.

ప్రజల విశ్వాసమే బలం

“ప్రజల విశ్వాసమే నాకు అతిపెద్ద బలం.. పార్టీ బలోపేతమే నా లక్ష్యం” అనే నినాదంతో పనిచేస్తున్న నరెడ్ల వీరారెడ్డి, వైసీపీ సిద్ధాంతాలను గ్రామగ్రామానికీ తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. సేవా దృక్పథం, క్రమశిక్షణ, ప్రజలతో మమేకమయ్యే నాయకత్వంతో భవిష్యత్తులో మరిన్ని కీలక బాధ్యతలు చేపట్టి ప్రజలకు మరింత సేవ చేయాలని అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు.