Nadendla Manohar |కూటమి ప్రభుత్వ కీలక నిర్ణయానికి కార్యరూపం
- తక్కువ ధరకే బియ్యం విక్రయాలు ప్రారంభం..
- రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు
- 500 రైస్ మిల్లుల్లో ప్రత్యేక కౌంటర్లు
- విజయవాడలో ప్రారంభించిన మంత్రి నాదెండ్ల
- భవిష్యత్తులో కందిపప్పు, పామాయిల్ కూడా తక్కువ ధరలకే..
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: సామాన్య ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలపై పెరుగుతున్న ధరల భారం తగ్గించేందుకు ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా తక్కువ ధరలకు బియ్యం విక్రయాలను ఘనంగా ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ అమ్మకాలు ప్రారంభించగా, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం సహకారంతో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకు నాణ్యమైన బియ్యాన్ని అందిస్తూ సామాన్య కుటుంబాలకు ఆర్థిక ఊరట కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది. ప్రజల అవసరాలను ముందుగానే గుర్తించి సంక్షేమంతో పాటు ధరల నియంత్రణపై దృష్టి సారిస్తున్న కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు మరింత ఉపయుక్తంగా మారనుంది.
విజయవాడలోని ఏపీఐఐసీ రైతు బజార్లో రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రజలకు స్వయంగా బియ్యాన్ని అందజేసి విక్రయాలను ప్రారంభించారు. ప్రత్యేక కౌంటర్లలో బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలో రూ.52కు, బీపీటీ రా రైస్‌ను కిలో రూ.50కు విక్రయిస్తున్నారు. ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యం అందజేస్తున్నారు.
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని సామాన్య ప్రజలకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాష్ట్ర రైస్ మిల్లర్లతో చర్చించి ప్రజలకు తక్కువ ధరలకు బియ్యం అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ఇందుకు రైస్ మిల్లర్లు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం రూ.62 నుంచి రూ.65 వరకు, బీపీటీ రా రైస్ రూ.58 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నప్పటికీ, ప్రత్యేక కౌంటర్లలో వరుసగా రూ.52, రూ.50కే అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు.

ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి..
రాష్ట్రంలోని అన్ని ప్రత్యేక కౌంటర్లలో ఆదివారం నుంచే బియ్యం విక్రయాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. భవిష్యత్తులో కందిపప్పు, పామాయిల్ కూడా తక్కువ ధరలకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు.
ప్రజలకు ఇబ్బందులు తలెత్తకముందే సమస్యలను గుర్తించి పరిష్కార చర్యలు తీసుకోవడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ తక్కువ ధరల బియ్యం విక్రయ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ నూపుర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు.

