గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను కలిసిన ఐటీడీఏ పీవో

గిరిజన ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు వెల్లడి

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారి మంద మకరంద్ ఆదివారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో అమలవుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై మంత్రికి వివరించారు. ఏజెన్సీ పరిధిలోని మారుమూల గ్రామాలు, తండాలు, గూడేల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గిరిజనుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి చేపడుతున్న చర్యలను వివరించారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు, విద్యుత్, సురక్షిత తాగునీటి సదుపాయాల మెరుగుదల, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యా ప్రమాణాల పెంపు, ఏజెన్సీ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవల కల్పనపై చేపడుతున్న చర్యలను వివరించారు.

గిరిజన యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా, అర్హులైన ప్రతి గిరిజనుడికి సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య, వైద్య రంగాలు మరింత బలోపేతం కావాలని సూచించారు. ప్రభుత్వ పథకాల ఫలాలు చివరి గిరిజనుడికి కూడా సకాలంలో అందేలా ఐటీడీఏ అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.

దీనికి స్పందించిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరంద్ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా గిరిజన ప్రాంతాల సర్వాంగీణ అభివృద్ధికి క్షేత్రస్థాయిలో పూర్తి సహకారంతో వేగవంతంగా పనిచేస్తామని మంత్రికి తెలిపారు.